మూసీకి సొబగులు!

ABN , First Publish Date - 2020-07-19T08:40:12+05:30 IST

మూసీ నవీకరణ, సుందరీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. గుజరాత్‌లోని సాబర్మతి నది తరహాలో మూసీ అభివృద్ధి దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితం...

మూసీకి సొబగులు!

సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు కసరత్తు..

పనులు ప్రారంభం, ఇరువైపులా రోడ్లు

దోమల నివారణకు కార్యాచరణ ప్రణాళిక


హైదరాబాద్‌ సిటీ, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మూసీ నవీకరణ, సుందరీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. గుజరాత్‌లోని సాబర్మతి నది తరహాలో మూసీ అభివృద్ధి దశాబ్దాలుగా ప్రతిపాదనలకే పరిమితం కాగా... ఇప్పుడిప్పుడే కదలిక కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఎంఆర్‌డీసీఎల్‌) ఆధ్వర్యంలో కసరత్తు మొదలు పెట్టారు. ఇప్పటికే మూసీ రివర్‌ బెడ్‌ నుంచి వ్యర్థాల తొలగింపు ప్రారంభం కాగా, ఇతర పనులు మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మూసీకి ఇరువైపులా అనువుగా ఉన్న ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, కాలుష్య నియంత్రణ, తీర ప్రాంత అభివృద్ధి లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక రూపొందించనున్నారు. కన్సల్టెన్సీ ఎంపిక కోసం ప్రతిపాదనలు ఆహ్వానించారు. ఈ ప్రక్రియకు ఎంఆర్‌డీసీఎల్‌ నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ప్రణాళిక రూపకల్పనలో భాగంగా గండిపేట నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు తూర్పు వైపు ఉన్న గౌరెల్లి వరకు 47 కిలోమీటర్లు, హిమాయత్‌సాగర్‌ నుంచి బాపుఘాట్‌ వరకు 8 కిలోమీటర్లతో కలిపి మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీ నది నైసర్గిక స్వరూపం గుర్తించేందుకు డ్రోన్‌ ద్వారా సర్వే చేపట్టారు. జీనో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ సర్వే చేస్తోందని ఎంఆర్‌డీసీఎల్‌ వర్గాలు తెలిపాయి. 


అంతర్జాతీయ సంస్థల డిజైన్లు

మూసీ నవీకరణ, సుందరీకరణకు డిజైన్లు సమర్పించాలంటూ అంతర్జాతీయస్థాయిలో ఎంఆర్‌డీసీఎల్‌ బిడ్డింగ్‌ నిర్వహించగా.. తొమ్మిది అంతర్జాతీయ సంస్థలు ప్రతిపాదనలు సమర్పించాయి. వీటిని ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టులో భాగంగా మూసీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. బాపు ఘాట్‌ నుంచి నాగోల్‌ బ్రిడ్జి వరకు 20 కిలోమీటర్ల మేర రివర్‌ బెడ్‌ నుంచి రూ.8.50 కోట్లతో చేపట్టి వ్యర్థాల తొలగింపు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఈ పనులు పూర్తయితే నదిలో ప్రవాహం సాఫీగా సాగుతుందని ఓ అధికారి చెప్పారు. నదిలోని పొదలు, చెత్తాచెదారాన్ని తొలగిస్తున్నారు. దోమల నివారణకు రూ.31 లక్షలతో పది యంత్రాల ద్వారా ఫాగింగ్‌ చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో దోమల నాశన యంత్రాలు ఏర్పాటు చేశారు. నది మధ్యలో రసాయనాలు పిచికారీ చేసేందుకు డ్రోన్లనూ వినియోగించనున్నారు. నాగోల్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ గౌరెల్లి వరకు మూసీ నాలుగు వరుసల రేడియల్‌ రోడ్డు నిర్మాణానికి కసరత్తు మొదలైంది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన స్టూప్స్‌ సంస్థ రూ.500 కోట్ల అంచనా వ్యయంతో నివేదిక సమర్పించింది. పరిశీలన పూర్తయిన అనంతరం టెండర్‌ నోటిఫికేషన్‌ ప్రకటిస్తామని ఓ అధికారి చెప్పారు. 

Updated Date - 2020-07-19T08:40:12+05:30 IST