అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు చంపేశారు

ABN , First Publish Date - 2020-09-29T16:47:14+05:30 IST

అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొడుకు అరాచకాలను అడ్డుకోవాల్సిన తండ్రే ఫిర్యాదిదారుపై కత్తితో దాడిచేసి

అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు చంపేశారు

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : అమ్మాయిని ఎందుకు వేధిస్తున్నావని అడిగినందుకు ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కొడుకు అరాచకాలను అడ్డుకోవాల్సిన తండ్రే ఫిర్యాదిదారుపై కత్తితో దాడిచేసి హత్యకు పూనుకోవడం జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలో తీవ్ర సంచలనం రేపింది. కుత్బుల్లాపూర్‌ ప్రాంతంలోని భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన కృష్ణ కుమార్తె ఎం.పావని (28) స్టాఫ్‌ నర్స్‌గా పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో తన సోదరుడు పవన్‌తో కలిసి బైక్‌పై ఆమె విమానపురి కాలనీకి వెళుతోంది. అదే సమయంలో విమానపురి కాలనీకి చెందిన సందీప్‌ అనే ఆకతాయి కుత్బుల్లాపూర్‌ ప్రభుత్వ పాఠశాల వద్ద అన్నాచెల్లెళ్లు ప్రయాణిస్తున్న బైక్‌ను ఓవర్‌టేక్‌ చేస్తూ పావనిని ఈవ్‌టీజింగ్‌ చేశాడు. వేగంగా ప్రయాణిస్తున్న సందీప్‌ను ప్రశ్నించడానికి యత్నించగా వాహనం అదుపుతప్పి కింద పడిపోయాడు. అన్నాచెల్లెళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సందీప్‌ తన చెల్లెలిని వేధిస్తున్నాడన్న విషయాన్ని పవన్‌ విమానపురి కాలనీకి చెందిన డ్రైవర్‌ అబ్బగోని సురేష్ గౌడ్‌ (30)కి చెప్పాడు. తన స్నేహితుడి చెల్లెలిని ఎందుకు వేధిస్తున్నావని అడగడానికి సురేష్ గౌడ్‌ సందీప్‌ ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇలా గొడవ జరుగుతుండగానే... సందీప్‌ తండ్రి విజయ్‌బోస్‌ (52) ఇంట్లోని కత్తితో సురేష్ గౌడ్‌ కడుపులో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన సురేష్ గౌడ్‌ను ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - 2020-09-29T16:47:14+05:30 IST