తహసీల్దార్‌ నాగరాజు.. కరప్షన్‌ కింగ్‌

ABN , First Publish Date - 2020-08-16T09:17:10+05:30 IST

నాగరాజు కెరీర్‌ కుత్బుల్లాపూర్‌ మండల కార్యాలయం నుంచి ప్రారంభమైంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న...

తహసీల్దార్‌ నాగరాజు.. కరప్షన్‌ కింగ్‌

  • ఔట్‌సోర్సింగ్‌ నుంచి తహసీల్దార్‌ స్థాయికి
  • గుప్పిట్లో అధికారులు.. వందల కోట్ల అక్రమార్జన
  • వివాదాస్పద స్థలాల సెటిల్మెంట్లు.. రూ.కోట్ల లంచం
  • కలిసి వచ్చిన ‘ప్రభుత్వ భూ ప్రక్షాళన’ పథకం
  • తహసీల్దార్‌ నాగరాజు సహా.. నలుగురి అరెస్టు
  • 36 లక్షలు, బ్యాంకు లాకర్లలో 2 కిలోల బంగారం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

నాగరాజు కెరీర్‌ కుత్బుల్లాపూర్‌ మండల కార్యాలయం నుంచి ప్రారంభమైంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అన్ని మండల కార్యాలయాల్లో కంప్యూటర్లను ప్రవేశపెట్టారు. భూరికార్డులను కంప్యూటరీకరించారు. అప్పట్లో అధికారులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం లేకపోవడంతో.. ప్రైవేటు వ్యక్తులను ఔట్‌సోర్సింగ్‌ కింద నియమించుకున్నారు. అలా నాగరాజు 1997లో కుత్బుల్లాపూర్‌ మండల కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా చేరాడు. అప్పటి నుంచే అవినీతి రుచి మరిగాడు. పేదలకు పట్టాలు పంచిన సమయంలో.. పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత తనదైన శైలిలో పైరవీలు చేసుకుని, తన కొలువును క్రమబద్దీకరించుకున్నాడు. జూనియర్‌ అసిస్టెంట్‌గా సర్వీసులో చేరాడు. కంప్యూటర్‌ ఆపరేటర్‌గా ఉన్నప్పుడే.. రెవెన్యూ రికార్డులను తారుమారు చేశాడు. కంప్యూటర్‌లో భూముల గోల్‌మాల్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలున్నాయి. ఇక.. ఉన్నతాధికారులను సులభంగా బుట్టలో వేసుకోవడం ఇతడి నైజం. నాగరాజు లేనిదే.. అతని సహాయసహకారాలు అందనిదే.. పనులు ముందుకు సాగవనేలా ఎదిగాడు. అప్పట్లోనే.. ఇద్దరు యువకులను తనకు ప్రైవేటు అసిస్టెంట్లుగా పెట్టుకుని, వసూళ్లకు పాల్పడేవాడు.


కూకట్‌పల్లిలో ప్రభుత్వ భూములు హాంఫట్‌

నాగరాజు 2016-17 కాలంలో కూకట్‌పల్లి తహశీల్దార్‌గా పని చేశాడు. ఆ సమయంలో ఓ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ), స్థానిక దళారుల సహకారంతో కోట్ల రూపాయల అక్రమార్జన చేశాడు. 2011లో ఇతనిపై ఏసీబీ కేసు (ఆదాయానికి మించిన ఆస్తులు) నమోదైనా.. ఆ కేసు దర్యాప్తు కొనసాగుతున్నా.. ఉన్నతాధికారుల అండదండలతో రియల్‌ఎస్టేట్‌ పరంగా అత్యంత కీలకమైన కూకట్‌పల్లి మండలానికి బదిలీ చేయించుకున్నాడు. ఏడీ సర్వే రికార్డులు ఉన్నా.. తనదైన శైలిలో మళ్లీ సర్వేలు చేయించి, నోటీసులు పంపుతామని బెదిరిస్తూ.. భూయజమానుల వద్ద రూ.కోట్లు లంచం తీసుకున్నాడు. లంచాలు తీసుకుని, 30 ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటుకు ధారాదత్తం చేసేశాడు. నాగరాజు హయాంలో ఇక్కడ పనిచేసిన ఆర్‌ఐలు కూడా కోట్లకు పడగలెత్తారంటే.. పరిస్థితిని అంచనా వేయొచ్చు. 




కోట్లు రాల్చిన భూ ప్రక్షాళన

‘‘పేదలు, రైతులకు భూ ప్రక్షాళనలో భాగంగా పట్టాలు ఇవ్వాలని సర్కారు తలిస్తే.. రెవెన్యూ అధికారులు వారి నుంచి లంచాలు వసూళ్లు చేస్తున్నారు. అసలు ఈ రెవెన్యూ శాఖ అవసరమా? లంచాల కోసమే ఈ శాఖ పనిచేస్తున్నట్లుంది’’ అని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు సందర్భాల్లో రెవెన్యూ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. నాగరాజు విషయంలోనూ.. భూప్రక్షాళన పథకం కోట్లను రాల్చే కామధేనువుగా మారింది. కీసర మండల పరిధిలో ఈ పథకంలో భాగంగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డాడు. ఒకరి భూమిని మరొకరి పేరిట మార్చాడు. అసలైన రైతులు, పట్టాదారులను కాదని, ఇతరులకు పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇచ్చాడు. ఇప్పటికీ పలువురు బాధితులు దీనిపై రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కుందనపల్లి సర్వే నెంబర్లు 114, 132బీలో ఉన్న 19 ఎకరాల భూమిలో.. ఆరుగురు లబ్ధిదారుల పేర్లను రికార్డుల నుంచి తొలగించాడు. దీనిపై ఇద్దరు మధ్యదళారులపై నేరెడ్‌మెట్‌ పోలీ్‌సస్టేషన్‌లో గత ఏడాది డిసెంబరులో కేసు నమోదైంది. ఇదే సర్వేనంబర్లకు ఆనుకుని ఉన్న రెండెకరాల ప్రభుత్వ భూమిని ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురానికి చెందిన రాంబాబు అనే వ్యక్తికి ధారాదత్తం చేశాడు. కీసరలోనూ ఓ భూవివాదానికి సంబంధించి ఒక వర్గానికి పాస్‌పుస్తకాలు ఇచ్చినందుకు ఆయనకు అంకిరెడ్డిపల్లిలో ఐదెకరాల భూమి నజరానాగా వచ్చినట్లు తెలిసింది. కీసరగుట్టలోని ప్రభుత్వ భూమిలోనూ ఆయన కొందరికి పట్టాలు ఇచ్చాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


సెటిల్మెంట్లకు ఏఎ్‌సరావునగర్‌ అడ్డా

అల్వాల్‌లో విలాసవంతమైన ఇంట్లో ఉంటున్న నాగరాజు.. ఇంటికీ, కీసరలోని కార్యాలయానికి మధ్యలో ఉన్న ఏఎ్‌సరావునగర్‌ను లంచాలకు, సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చుకున్నాడు. అతని కోసం పనిచేసే దళారీ అంజిరెడ్డి.. ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. నాగరాజు నాలుగు నెలలు అల్వాల్‌లో, 8 నెలలు ఏఎ్‌సరావునగర్‌లో ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. రెండు ఇళ్లలోనూ నాగరాజు జీవనశైలి ‘ఫైవ్‌స్టార్‌’ స్థాయిలో ఉండేది. ఇళ్లలోనే బార్లను ఏర్పాటు చేసుకుని, ఖరీదైన విదేశీ మద్యాన్ని కూడా నిల్వచేసుకునేవాడు. ఏసీబీ అధికారులు శుక్రవారం రాత్రంతా జరిపిన సోదాల్లో అల్వాల్‌లోని ఆయన కారులో రూ. 8 లక్షలు, ఇంట్లో రూ. 28 లక్షల నగదు, కొన్ని ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లలో ఉన్న రెండు కిలోల బరువున్న బంగారు ఆభరణాలను సీజ్‌ చేశారు.


రంగంలోకి ఆదాయపన్ను శాఖ?

భారీ లంచం వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ దృష్టిసారించింది. ఏసీబీ దర్యాప్తు పూర్తవ్వగానే తాము రంగంలోకి దిగుతామని ఐటీ శాఖ అధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. ‘‘తహసీల్దార్‌కు లంచం ఇచ్చిన డెవలపర్‌ శ్రీనాథ్‌కు అంతమొత్తం ఎక్కడి నుంచి వచ్చింది?అని విచారణ జరపాల్సి ఉంది. తహసీల్దార్‌ ఆస్తుల లెక్క తేలాక.. సోర్స్‌ ఆఫ్‌ ఇన్‌కమ్‌పై విచారణ చేపడతాం’’అని చెప్పారు.


ఓ ఎంపీ హస్తం ఉన్నట్లుగా చర్చ?

మేడ్చల్‌ జిల్లా రాంపల్లి దాయరలో 19.39 ఎకరాల భూవివాదం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వివాదంలో ఓ ఎంపీ హస్తం ఉన్నట్లు చర్చ సాగుతోంది. భూ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారనే అంశంపై ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో అంజిరెడ్డి కారులో ఎంపీకి సంబంధించిన లెటర్‌ప్యాడ్లు, ఇతర పత్రాలు లభించినట్లు తెలిసింది. అందులో.. ఎంపీ తన నిధుల నుంచి పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం సిఫారసు చేసిన లేఖలు కూడా ఉన్నాయని తెలిసింది. దీంతో ఈ భూవివాదంలో ఎంపీ పాత్ర ఎంతమేరకు ఉందన్న అంశంపై ఏసీబీ అధికారులు లోతుగా విచారణ జరుపుతున్నారు.


నలుగురి అరెస్టు.. 

రాంపల్లి దాయరలోని 53 ఎకరాల వ్యవహారంలో నాగరాజు రూ. 1.10 కోట్ల లంచం తీసుకోవడంతో.. ఆ భూ వ్యవహారం పైనా ఏసీబీ అధికారులు దృష్టిసారించారు. శనివారం ఉదయం 11 నుంచి సాయంత్ర 5 గంటల వరకు తహసీల్దార్‌ కార్యాలయంలో సోదాలు జరిపారు. నాగరాజు వాడే కంప్యూటర్‌ను పరిశీలించారు. హార్డ్‌డి్‌స్కను సీజ్‌ చేశారు. డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసన్న, ఆర్‌ఐ శశికళ, మండలంలో పనిచేసే వీఆర్వోలు, వీఆర్‌ఏలను ప్రశ్నించి, వారి వాంగ్మూలాన్ని సేకరించారు. ఏసీబీ అధికారులు నాగరాజుతోపాటు.. శ్రీ సత్య డెవలపర్స్‌ యజమాని చౌల శ్రీనాథ్‌ యాదవ్‌, మధ్యదళారీ కందాడి అంజిరెడ్డి, రాంపల్లి దాయర వీఆర్‌ఏ బొంగు సాయిరాజ్‌ను అరెస్టు చేశారు.

Updated Date - 2020-08-16T09:17:10+05:30 IST