ఎంపీ సుజనాచౌదరికి పితృవియోగం
ABN , First Publish Date - 2020-12-06T07:55:38+05:30 IST
రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి తండ్రి యలమంచిలి జనార్దనరావు(88) శనివారం తెల్లవారుజామున

సాగునీటి శాఖలో కీలక బాధ్యతలు నిర్వహించిన జనార్దనరావు
రాయదుర్గం, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి తండ్రి యలమంచిలి జనార్దనరావు(88) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. అంత్యక్రియలను జూబ్లీహిల్స్ విస్పర్‌వ్యాలీలోని వైకుంఠ మహాప్రస్థానంలో ఉదయం 11.45 గంటలకు నిర్వహించారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు సంతాపం తెలిపారు.
కృష్ణా జిల్లా దోసపాడులో 1932 జనవరి 9న జన్మించిన జనార్దనరావు కోయంబత్తూరులోని పీఎస్టీ కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ పట్టాపొందారు. అనంతరం 1955లో సాగునీటి శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా నాగార్జునసాగర్, కోయల్‌సాగర్ గేట్ల నిర్మాణం, వాటిని అమర్చడంలో కీలకపాత్ర పోషించారు.
హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనార్దనరావుకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఉత్తమమైన సేవలకు పలు అవార్డులు లభించాయి. ఆయనకు భార్య సుశీల, నలుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సుజనాచౌదరి చిన్నకుమారుడు.