ఎంపీల జీతాల కోతకు మద్దతు
ABN , First Publish Date - 2020-04-07T09:11:20+05:30 IST
లాక్‌డౌన్‌ను పొడిగించాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ‘‘కనీసం ఒకటి, రెండు వారాలు పొడిగించాలి. ఆ తర్వాత సమీక్షించాలి. లాక్‌డౌన్ ఎక్కడ నుంచి తీసేయాలి. బస్సులు, రైళ్లు, విమానాలు... ఎక్కడ మొదలు పెడతాం? ఒక్కసారి గేట్లు తీసి..

హైదరాబాద్: లాక్‌డౌన్‌ను పొడిగించాలని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు. ‘‘కనీసం ఒకటి, రెండు వారాలు పొడిగించాలి. ఆ తర్వాత సమీక్షించాలి. లాక్‌డౌన్ ఎక్కడ నుంచి తీసేయాలి. బస్సులు, రైళ్లు, విమానాలు... ఎక్కడ మొదలు పెడతాం? ఒక్కసారి గేట్లు తీసి.. నువ్వాగు.. నువ్వుండు అంటే సమాజంలో చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకరు ఎక్కువ.. తక్కువ అనే భేద భావాలు వస్తాయి. పొడిగింపును ప్రజలు కూడా అంగీకరిస్తారని అనుకుంటున్నా. నేను ఏదీ దాచుకునే రకం కాదు. సమాజ హితం కోరి చెప్పేమాట ఇది’’ అని కేసీఆర్ అన్నారు. కేంద్రం లాక్‌డౌన్ ఎత్తివేయాలని నిర్ణయం తీసుకుంటే, రాష్ట్రంలో ఎత్తివేస్తారా? అన్న విలేకరుల ప్రశ్నకు కేసీఆర్ బదులిస్తూ.. ‘‘లాక్‌డౌన్ కొనసాగిస్తాం. సమాజం అభిప్రాయాన్ని అడుగుతాం’’అని చెప్పారు. ‘‘ఎకాఎకిన లాక్‌డౌన్ ఎత్తేస్తే 21 రోజుల తపస్సు గంగలో పోసినట్టే కదా? మళ్లీ మొదటికి వచ్చినట్టే. మరో వారమో పది రోజులో ఓర్చుకుంటే కంట్రోల్‌లో ఉంటుందని ఆశిస్తున్నా. ఒక నెల లాక్‌డౌన్ చేసుకుని, మూడు నెలలు ఆర్థికంగా ఇబ్బంది పడినా మంచిదే. కానీ, ఒక నెల ఆగమాగం ఓపెన్ చేసి వందలు వేల మంది చావడం ఎందుకు? సింగపూర్‌లో ఫోజులు కొట్టి ఎత్తేశారు. హైదరాబాద్ అంత కూడా ఉండదు. వాళ్లే నియంత్రించుకోలేక మళ్లీ నెల రోజులు పెట్టారు. మనం ఎలా చేస్తాం?’’ అని కేసీఆర్ అన్నారు. కాగా, ఎంపీల జీతాల కోత ప్రతిపాదనకు కేసీఆర్ మద్దతు ప్రకటించారు. మోదీ తనకు చెప్పగానే 30 శాతం ఎందుకు 70 శాతం కోయండని చెప్పానన్నారు.
అవసరమైతే మీమీద కేసు వేస్తాం
‘‘వైద్యులకు రక్షణ ఏదీ? అని మొన్న ఒక పత్రిక రాసింది. వైద్యులకు రక్షణ ప్రభుత్వం చూస్తుందా? ఈ పత్రికాయనే చూస్తడా? బుద్ధీ.. జ్ఞానం ఉండాలి. పీపీఈ కిట్లు లేవని రాస్తారు. మా దగ్గర పీపీఈ కిట్లు 80 వేలు ఉన్నాయి. అవసరమైతే మీ మీద కేసు వేస్తాం. డాక్టర్లు మనోధైర్యం కోల్పోయేటట్లు వార్తలు రాయడం దుర్మార్గం. వాళ్లకు శిక్ష తప్పదు. ఇప్పుడు ఒక్కటి తక్కువగా ఉన్నా సరిపెట్టాలె? ప్రభుత్వాన్ని ఇరుకున పెడ్తావా? చేతనైతే రెండు మంచి వార్తలు రాయి. లేకుంటే ఇంట్లో పడుకో. ఐదు లక్షల పీపీఈ కిట్లకు, లక్షల మాస్కులకు ఆర్డర్ చేసినం. ఈ దుర్మారం చేసే వాళ్లకు కరోనా తగలాలని శాపం పెడుతున్నా’’అని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ప్రతీదీ రికార్డుగా ఉంది. సరైన సమయంలో పనిష్మెంట్ ఇస్తాం. చేతులు ముడుచుకుని కూర్చోం. కఠిన శిక్షలు విధిస్తాం’’ అని హెచ్చరించారు.
వెంటనే రిపోర్టు చేయండి!
‘‘నిజాముద్దీన్ వెళ్లి వచ్చిన 99 శాతం వారిని గుర్తించాం. మీ ప్రాణాలకే ముప్పు అని గ్రహించి, ఇంకా ఎవరైనా ఉంటే వెంటనే రిపోర్టు చేయండి’’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో కొందరు ఉద్యోగులు రాత్రింబవళ్లు పని చేస్తున్నారని, వాళ్లను ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ల దగ్గర కొంత డబ్బు పెడుతున్నామని చెప్పారు. వివరాలు మంగళవారం ప్రకటిస్తామని అన్నారు.
గన్నీ బ్యాగ్స్ కొరతను అధిగమిస్తాం!
‘‘గన్నీబ్యాగ్స్ గురించి కేంద్రం తీవ్రంగా ఆలోచిస్తోంది. మమతా బెనర్జీతో మాట్లాడుతున్నాం. సేకరించిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ఇస్తాం. 50-60 శాతం గన్నీబ్యాగుల్లో ఇవ్వాలని వాళ్లు షరతు విధిస్తారు. దేశవ్యాప్తంగా సమస్య ఉందని, బెంగాల్ నుంచి ఉత్పత్తి చేసి పంపిస్తామని ప్రధాని చెప్పారు. మిగిలిన ఆప్షన్ ఒకటే. వంద శాతం ప్లాస్టిక్ బ్యాగుల్లో తీసుకోవడానికి ఎఫ్‌సీఐ, కేంద్రం ఒప్పుకోవాలి. తెలంగాణలో మొదటిసారి 40 లక్షల ఎకరాల్లో వరి పంటను కోస్తున్నారు. ఈ కరోనా దరిద్రం లేకపోతే నేను డ్యాన్స్ చేసేంత సంతోషం. దురదృష్టం కొద్దీ ఈ వైర్‌సలో చిక్కుకున్నాం. డబ్బుల్లేకపోయినా 7 వేల కేంద్రాలు ఏర్పాటు చేసి రూ.30 వేల కోట్లతో మక్కలు, వడ్లు కొంటున్నాం. బ్యాగుల సమస్యను కూడా అధిగమిస్తాం’’ అని స్పష్టం చేశారు. ‘‘ప్రైవేటు పరిశ్రమల్లో జీతాలు ఎక్కడాఇవ్వడం లేదనే చర్చ జరుగుతోంది. దీనిపై సీఎస్, పరిశ్రమల మంత్రి సమీక్ష చేయాలి. కేంద్రం కూడా ఆలోచిస్తోంది. పరిశ్రమల్లో ఎన్ని ఉద్యోగాలున్నాయి? లాక్‌డౌన్ వల్ల పారిశ్రామిక వేత్తలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? అన్నీ చూసి, సబ్సిడీలు, కొన్ని రకాల రాయితీలు ఇస్తారు. ఏటా రాష్ట్రం రూ.30 వేల కోట్ల అప్పు కడుతోంది. దాన్ని వాయిదా వేయాలని కోరతాం. కరోనా ఎక్కడో ఒకచోట ముగుస్తుంది కానీ లాక్‌డౌన్ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. దీనిపై బుద్ధి జీవులు ఇప్పటి నుంచే ఆలోచించాలి’’ అని కేసీఆర్ సూచించారు. ముఖ్యమంత్రులు, ఆర్థిక వేత్తలతో ప్రధాని సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.
బతికుంటే బలుసాకు తినొచ్చు
‘‘విద్యార్థులకు సంబంధించి ఎలాంటి ఊగిసలాట లేదు. అన్ని బంద్ అయిపోయాయి. ఎప్పుడు ఎత్తేస్తారో తెలియదు. ముందు బతికుంటే కదా అకడమిక్ ఇయర్. బతికుంటే బలిసాకు తినొచ్చు. హైదరాబాద్ సంస్థానం ఇండియాలో విలీనం అయింది. అప్పట్లో హెచ్‌ఎ్‌ససీలో జైహింద్ బ్యాచ్ అని ఉండేది. ఆల్ పాస్ అన్నారు. దాంతో 8, 9 సార్లు డింకీ కొట్టిన వాళ్లు కూడా పాసయ్యారు. వారిలో ఐఏఎ్‌సలు, జడ్జీలు అయిన వాళ్లు ఉన్నారు. యుద్ధాలు, విపత్తులు వచ్చినప్పుడు కొన్ని గమ్మత్తుగా జరుగుతాయి. మనం కర్తలం కాదు. నలుగురితో నారాయణ’’ అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు.
కేసులన్నీ కాంటాక్ట్ వల్ల వచ్చినవే!
‘‘కేసులన్నీ కాంటాక్ట్ వల్ల వస్తున్నవే. ఈ వైరస్‌ను ఎలా డీల్ చేయాలో చాలా మందికి తెలియదు. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ను స్టేజ్-3 అంటారు. ఎక్కడైనా ఫంక్షన్, సమూహాలుగా ఉన్నప్పుడు వైరస్ ఎవరి నుంచి వచ్చిందో సోర్స్ తెలియకుండా 10-15 మందికి వస్తే దాన్ని కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అంటారు. అది మన దగ్గర అసలే లేదు. అంతా విదేశాలు, మర్కజ్ బాపతు తప్ప సోర్స్ దొరకకుండా వచ్చిన కేసులు అసలే రాలేదు’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.