రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరగాలి
ABN , First Publish Date - 2020-10-08T09:20:23+05:30 IST
రెండు తెలుగు రాష్ట్రాల్లో అటవీ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణం సీబీఐ విచారణ

అక్రమాలపై కేంద్రం నోటిసులిచ్చినా పట్టింపులేదు
15లోపు స్పందించకపోతే చర్యలు తప్పవు: అర్వింద్
హైదరాబాద్, అక్ట్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో అటవీ భూముల్లో అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఆ రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణం సీబీఐ విచారణ కోరాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ అక్రమ మైనింగ్‌పై కేంద్రం, రెండు రాష్ట్రాల అటవీ, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులకు 3 సార్లు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈనెల 15లోపు ఆయా అధికారులు స్పందించకపోతే కేంద్రమే తదుపరి చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ, ఏపీలోని గుంటూరు జిల్లాల పరిధిలో అటవీశాఖకు చెందిన రిజర్వ్ ఫారెస్టులో అక్రమ మైనింగ్ జరిగినట్లు కేంద్ర అటవీ, గనుల మంత్రిత్వశాఖలు వెల్లడించాయని తెలిపారు. పర్యావరణ అనుమతుల్లేకుండా అక్రమ మైనింగ్ చేపట్టిన మైహోం సంస్థ నుంచి కనీసం వెయ్యికోట్ల జరిమానా కట్టిస్తానని ప్రకటించారు. నిబంధనల ఉల్లంఘన జరిగిందని తెలిసినా తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, అటవీ సంరక్షణ ప్రధానాధికారి శోభ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు.
మా నాన్న బురద నుంచి పెంటలో పడ్డరు
కాంగ్రెస్ పార్టీ బురద నీరు లాంటిదని, ఆ బురదను కడుక్కోవాలని తన తండ్రి డి. శ్రీనివా్‌సకు గతంలో తాను చెప్పినట్లు అర్వింద్ తెలిపారు. అయితే, ఆ బురదనీరు పోయి పెంటలో పడిందని.. పరోక్షంగా టీఆర్‌ఎస్ పార్టీ పెంట అని వ్యాఖ్యానించారు. జూపల్లి రామేశ్వరరావుతో తమకు 35 ఏళ్లనుంచి పరిచయం ఉందని పేర్కొన్నారు. తన అక్రమ మైనింగ్‌ను ప్రస్తావించకుండా ఉండాలని కోరేందుకు ఆయన.. గత మే నెలలో తమ ఇంటికి వచ్చారన్నారు. ఆ సమయంలో తాను ఇంట్లో లేనని, తన తండ్రిని కలిసి వెళ్లారని చెప్పారు. ఖర్మకొద్ది కన్న తండ్రి మాటనే వినని తాను.. తండ్రిలాంటి వ్యక్తి మాట ఎలా వింటానని ఆయన అన్నారు.