వాస్తవాలు తెలియజేస్తే కరోనా రావాలంటారా?
ABN , First Publish Date - 2020-04-07T09:28:07+05:30 IST
క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలియజేస్తే.. అలాంటివారికి కరోనా రావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగినవి

- కేసీఆర్ అహంకార వ్యాఖ్యలు సరికాదు
- ఆ స్థాయికి దిగజారడం మంచి పద్ధతి కాదు: బండి సంజయ్
హైదరాబాద్, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలోని వాస్తవాలను తెలియజేస్తే.. అలాంటివారికి కరోనా రావాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి స్థాయికి తగినవి కావని హితవు పలికారు. జరిగిన విషయాలను మీడియా ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే.. వాస్తవాలు తెలియజేయాల్సిందిపోయి వారికి కరోనా రావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కరోనాపై పోరాటంలో పత్రికలు, ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా సహకరిస్తున్నాయని చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో క్షేత్రస్థాయిలో పరిస్థితిని మీడియా.. ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వాటిని సలహాలు, సూచనలుగా తీసుకోవాలని, కానీ అహంకారంతో వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కరోనా రావాలని కోరుకునే స్థాయికి దిగజారడం మంచి పద్ధతి కాదని కేసీఆర్‌కు హితవు పలికారు. కరోనా కట్టడికి అహర్నిశలు కృషి చేస్తున్న వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పీపీఈ కిట్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్‌లోని తన ఇంటిపై ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు తదితర నేతలు తమ ఇళ్లపై పార్టీ జెండా ఆవిష్కరించారు. నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాసులు, ఎమ్మెల్యే రాజాసింగ్ తన నియోజకవర్గంలో పార్టీ జెండా ఎగురవేశారు. బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశాల మేరకు లాక్‌డౌన్ కారణంగా కష్టాలను ఎదుర్కొంటున్న పేదలు, రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు సంఘీభావంగా కార్యకర్తలు సోమవారం ఉపవాస దీక్ష చేశారు.