ఎంపీ బండి కార్యాలయం ముందు టెంట్లు వేసిన నేతలు
ABN , First Publish Date - 2020-10-27T16:21:45+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గరపడే కొద్ది రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది.

కరీంనగర్ : దుబ్బాక ఉప ఎన్నికకు సమయం దగ్గరపడే కొద్ది రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే రణరంగాన్ని తలపిస్తోంది.!. సోమవారం నాడు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు మామ ఇంట్లో జరిగిన వ్యవహారం గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో మొదలైన ఈ వివాదానికి ఇంకా ఫుల్ స్టాప్ పడనేలేదు. ఆ తర్వాత రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్‌తో ఈ వ్యవహారం మరింత ముదిరింది. ఆయన అరెస్ట్‌కు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు.
బండికి మద్దతుగా..
కరీంనగర్‌లో ఎంపీ కార్యాలయం బీజేపీ నేతలు ఎదుట టెంట్లు వేశారు. సంజయ్‌కు మద్దతుగా కార్యకర్తలు, నేతలు దీక్షలో కూర్చున్నారు. కొద్దిసేపటి క్రితమే బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఎంపీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మరోవైపు.. బండి అరెస్ట్‌కు నిరసనగా ఏబీవీపీ, బీజేవైఎం నాయకులు చలో ప్రగతిభవన్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రగతి భవన్‌వద్దకు వందల సంఖ్యలో చేరుకుంటున్నారు.
బీజేపీ సీరియస్..
ఇదిలా ఉంటే.. రఘునందన్ రావు మామ, బంధువుల ఇంటిపై పోలీసుల దాడి చేసిన వ్యవహారాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. సంఘటనపై, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేసే యోచనలో అభ్యర్థి ఉన్నారు. మరోవైపు.. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసే యోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. ఉప ఎన్నికల సందర్బంగా జరుగుతున్న పరిణామాలపై బీజేపీ కేంద్ర పెద్దలు నిశితంగా పరిశీలిస్తున్నారు. అటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇటు అభ్యర్థి రఘునందన్ రావుకు ఫోన్ చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీస్తున్నారు. రాష్ట్ర పోలీసు యంత్రాంగంపై ఆరోపణల నేపథ్యంలో కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికలు జరపాలని బీజేపీ నుంచి డిమాండ్ పెరుగుతోంది.