దళితులు, గిరిజనుల స్వయం సమృద్ధికి మరిన్ని పనులు
ABN , First Publish Date - 2020-10-07T08:18:30+05:30 IST
రాష్ట్రంలో దళిత, గిరిజనుల స్వయం సమృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర షెడ్యూల్ కులాల

మంత్రులు ఈశ్వర్, సత్యవతి
హైదరాబాద్, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దళిత, గిరిజనుల స్వయం సమృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ మేరకు తగు ప్రతిపాదనలను త్వరలో సీఎం కేసీఆర్‌కు సమర్పిస్తామన్నారు. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో సంక్షేమ, శ్రేయోరాజ్యం కొనసాగుతోందన్నారు. దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలపై మంగళవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో ఇరువురు మంత్రులు 3 గంటల పాటు సమీక్షించారు.
దళిత, గిరిజన ప్రజాప్రతినిధులతో గత నెల 15న అసెంబ్లీ ఆవరణలో జరిగిన భేటీకి కొనసాగింపుగా ప్రస్తుత సమావేశాన్ని నిర్వహించినట్లు అధ్యక్షత వహించిన కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రంలో దళితులు, గిరిజనులు మొత్తం 65 లక్షల మంది ఉన్నారని, వీరిలో 90 శాతం మంది నిరుపేదలని తెలిపారు. వారిని ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. హైదరాబాద్ స్టడీ సర్కిల్‌ను మోడల్‌గా తీర్చిదిద్దడంతో పాటు జిల్లాల్లోని శాఖలనూ బలోపేతం చేయాలని కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు.
దళిత, గిరిజనుల్లో పేదరికాన్ని విద్య ద్వారానే రూపుమాపగలమని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. పోడు భూముల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిష్కరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు రాహుల్‌బొజ్జా, డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, యోగితారాణా, క్రిస్టియానా, కరుణాకర్, హనుమంతునాయక్, సర్వేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.