‘టీపీసీసీ’కి మరింత సమయం

ABN , First Publish Date - 2020-12-15T08:05:25+05:30 IST

తెలంగాణ పీపీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు మరికొంత సమయం పడుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ వెల్లడించారు.

‘టీపీసీసీ’కి మరింత సమయం

సంప్రదింపుల తర్వాత అధ్యక్షురాలికి నివేదిక

బీజేపీ, టీఆర్‌ఎ్‌సది.. గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ

ఢిల్లీలో విలేకరులతో  మణిక్కం ఠాగూర్‌

న్యూఢిల్లీ, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పీపీసీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు మరికొంత సమయం పడుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ వెల్లడించారు. మరికొందరితో సంప్రదింపులు జరిపిన తర్వాత, పార్టీ అధ్యక్షురాలికి నివేదిక అందిస్తానని తెలిపారు. రాష్ట్రానికి ప్రగతిశీల నాయకత్వాన్ని అందిస్తామని చెప్పారు. ఢిల్లీలో సోమవారం విలేకరులతో ఆయన మా ట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ఇప్పటికే 162 మంది అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. అధ్యక్షుడిని ఖరారు చేసే ముందు సీనియర్‌ నేతలతో మరోసారి సంప్రదింపులు జరుపుతామన్నారు.


తెలంగాణలో ఇటీవలి ఎన్నికల ఫలితాలపై పార్టీలో సుదీర్ఘంగా సమీక్షించామని చెప్పారు. దుబ్బాక.. కాంగ్రె్‌సకు ఎప్పుడూ కష్టమైన స్థానమేనని, స్థానికంగా సంస్థాగతంగా బలహీనంగా ఉండడం వల్ల జీహెచ్‌ఎంసీలో పరాజయం పాలయ్యామని చెప్పారు. హైదరాబాద్‌ నగర పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేశారని, ఆ స్థానాన్ని కూడా భర్తీ చేస్తామన్నారు.


ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ భేటీపై ఠాగూర్‌ స్పందిస్తూ.. టీఆర్‌ఎస్‌, బీజేపీ గల్లీల్లో కుస్తీ పడుతూ.. ఢిల్లీలో దోస్తీ చేస్తున్నాయని ఆరోపించారు. మోదీ, కేసీఆర్‌ మంచి మిత్రులని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్‌షాను కలిసిన నేపథ్యంలో ఇక ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలు సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబానికి దూరంగా ఉంటాయన్నారు. కేసీఆర్‌ కుటుంబ అవినీతిపై బీజేపీ వైఖరేంటో బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజలు తిరస్కరించిన నాయకులే కాంగ్రె్‌సను వీడి బీజేపీలో చేరుతున్నారని, ఆ పార్టీ వృద్ధాశ్రమంగా మారిందన్నారు. తాము కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తామని స్పష్టం చేశా రు.


భవిష్యత్తులో టీఆర్‌ఎస్‌ ప్రాబల్యం తగ్గిపోతుందని జోస్యం చెప్పారు. సెంటిమెంట్లతో ఎల్లకాలం ఎన్నికల్లో విజయం సాధించలేరన్నారు. తాను కొద్దికాలం ముందు తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జిగా వెళ్లి ఉంటే.. దుబ్బా క ఉప ఎన్నికలో ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్‌ ఇచ్చే వాళ్లమని చెప్పారు. బీజేపీలో కాంగ్రెస్‌ నేతల చేరికలపై స్పందిస్తూ.. డీకే అరుణ, ధర్మపురి అర్వింద్‌ తమ నేతలకు ఫోన్లు చేసి పార్టీ మారాలని కోరుతున్నారని తెలిపారు. వీరిద్దరి వెనుక బీజేపీ సంఘటన్‌ కార్యదర్శి మంత్రి శ్రీనివాస్‌ ఉన్నారన్నారు. 


Updated Date - 2020-12-15T08:05:25+05:30 IST