పంట రుణమేదీ?

ABN , First Publish Date - 2020-06-22T09:53:59+05:30 IST

రాష్ట్రంలో బ్యాంకులు రైతులను గాలికి వదిలేశాయి. వానాకాలం పంట రుణాల సీజన్‌ మొదలై రెండున్నర నెలలు గడిచినా ..

పంట రుణమేదీ?

రెండున్నర నెలల్లో ఇచ్చింది రూ.458 కోట్లే.. 2%కూడా చేరని వానాకాలం రుణ వితరణ

పంపిణీకి మిగిలింది మూడున్నర నెలలే 

రైతుల అవసరాలు జూన్‌, జులై నెలల్లోనే

రుణ ప్రణాళిక రూ.33,713 కోట్లు

విపత్తు వేళ మరో 10% ఇవ్వాలన్న కేంద్రం


హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బ్యాంకులు రైతులను గాలికి వదిలేశాయి. వానాకాలం పంట రుణాల సీజన్‌ మొదలై రెండున్నర నెలలు గడిచినా నిర్దేశించిన లక్ష్యంలో రెండుశాతం కూడా రుణాలను మంజూరు చేయలేదు. రైతులను బ్యాంకుల చు ట్టూ తిప్పించుకుంటున్నారు. పాత బకాయిలున్నాయ ని, రుణ మాఫీ నిధులు రాలేదని, వడ్డీ పెండింగ్‌ ఉం దని, పావలా వడ్డీ రాలేదని, ఇలా రకరకాల సాకులు చెప్పి రుణాలు ఇవ్వకుండా కాలం దొర్లిస్తున్నారు. దేశమంతా వ్యవసాయ రుణ పరపతి పెరుగుతుంటే తెలంగాణలో మాత్రం తగ్గుతోందని ఇటీవలే పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో వెల్లడైంది. మూడేళ్ల క్రితం రూ.47 వేల కోట్లు వ్యవసాయ రుణాలుగా అందించిన బ్యాంకులు, 2018- 19 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.27 వేల కోట్లు పంపిణీ చేశాయి. ఒక్క సంవత్సరంలో చిన్న, సన్నకారు రైతులకు ఇచ్చే రుణం ఏకంగా రూ.20 వేల కోట్లు తగ్గిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు పెట్టుబడుల అవసరం ఎక్కువగా ఉండే జూన్‌, జూలై నెలల్లో రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.


రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమి తి తయారు చేసిన రుణ ప్రణాళికలను ఆచరణలో పెట్టకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కూడా పట్టించుకోకపోవడంతో ఈపరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఏడాది ఇంకా వ్యవసాయ రుణ ప్రణాళిక ఇంకా ప్రకటించనప్పటికీ రైతులకు పంట రుణాలను ఏప్రిల్‌ 1 నుంచే అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశించి రెండున్నర నెలలు గడిచిపోయాయి. కేవలం రూ.458 కోట్లు పంపిణీ చేశారు. గతేడాది రుణ ప్రణాళిక ప్రకారం ఈ ఏడాది రూ.73,686 కోట్ల మేర రుణాలు ఇవ్వాలి. వానాకాలం సీజన్‌లో రూ.30,649 కోట్లు పంపిణీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం కరోనా విపత్తు వేళ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా... గతంలో నిర్ణయించిన స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌పై 10శాతం అదనపు రుణం ఇవ్వాలని బ్యాంకర్లను ఆదేశించారు. అంటే, రైతులకు మరో రూ. 3,064కోట్లు అదనం గా రుణం లభించాలి. అంతా కలిపి వానాకాలం లోనే రూ. 33,713 కోట్లు రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. బ్యాంకర్లు రుణాలు ఇవ్వకపోవటం తో రైతులు ప్రైవేటు అప్పులు చేయక తప్పటంలేదు. గతేడాది ఘోరం

రాష్ట్రంలో 59 లక్షల మంది రైతులుంటే గడిచిన యాసంగి సీజన్‌లో కేవలం 16 లక్షల మంది రైతులకే బ్యాంకర్లు పంట రుణాలు ఇచ్చారు. ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయం ప్రకారం రూ.19,496 కోట్ల పంట రుణాలను గడిచిన  రబీలో ఇవ్వాలి. కీలకమైన నాలుగు నెలల్లో(అక్టోబర్‌- 2019 నుంచి ఫిబ్రవరి- 2020) కేవలం రూ.7,628 కోట్లు(39 శాతం) పంపిణీ చేశారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు ఎక్కువగా ఇవ్వాలని లక్ష్యం నిర్దేశించింది. రాష్ట్రంలో పంటల సాగు 99 శాతం పూర్తయిన సమయానికి 39 శాతమే రుణ పంపిణీ చేశారు. యాసంగి సీజన్‌ ముగిసే నాటికి 75 శాతం లక్ష్యం(రూ.14,622 కోట్లు) పూర్తి చేశారు.   నిరుడు వానాకాలం సీజన్‌లో రూ.29,244 కోట్ల రుణ లక్ష్యం ఉంటే... రూ.18,711 కోట్లు(63.98 శాతం) రైతులకు పంపిణీ చేశారు.  

Updated Date - 2020-06-22T09:53:59+05:30 IST