టీఆర్‌ఎస్ వల్లే డబ్బు రాజకీయం!
ABN , First Publish Date - 2020-12-15T07:52:01+05:30 IST
రాష్ట్రంలో ‘డబ్బుతోనే ఓటు రాజకీయం’ అన్న విధంగా పరిస్థితులు ఏర్పడడానికి టీఆర్‌ఎస్సే ప్రధాన కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు.

సిద్ధాంతాలు చెప్పే బీజేపీదీ అదే దారి
మా పార్టీలోనూ డబ్బున్న నేతలున్నారు
కానీ.. కాంగ్రె్‌సలో అలాంటి పద్ధతి లేదు
అందరి సమన్వయంతో టీపీసీసీ చీఫ్: జగ్గారెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘డబ్బుతోనే ఓటు రాజకీయం’ అన్న విధంగా పరిస్థితులు ఏర్పడడానికి టీఆర్‌ఎస్సే ప్రధాన కారణమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. సిద్ధాంతాలు చెప్పే బీజేపీ కూడా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో డబ్బును ఉపయోగించే గెలిచిందని ఆరోపించారు. డబ్బే ప్రధానమనుకుంటే.. కాంగ్రె్‌సలోనూ అలాంటి నాయకులున్నారన్నారు. 2023లో డబ్బుంటేనే ఎన్నికలనుకుంటే కాంగ్రె్‌సలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టగల సత్తా ఉన్న నాయకుడన్నారు. కానీ.. అలా డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే పద్ధతి కాంగ్రె్‌సలో లేదని, అందుకే ఎన్నిక ల్లో ఓడిపోతున్నామని వ్యాఖ్యానించారు.
సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో డబ్బు ప్రభావం లేదని, ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పాలన నడిచిందన్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీఆర్‌ఎస్సే ఓట్ల కొనుగోలు విధానాన్ని తీసుకువచ్చిందని ఆరోపించారు.
‘‘టీఆర్‌ఎస్ పాలనను బట్టి గత ఐదున్నరేళ్లుగా ప్రజల్లో ఒక చర్చ నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మాత్రమే డబ్బు పెట్టగలవన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. రాజకీయాల్లో డబ్బే ప్రధానమైతే రూ.వెయ్యి కోట్లు ఖర్చుపెట్టే సామర్థ్యం ఉన్న వారు కాంగ్రె్‌సలో చాలా మంది ఉన్నారు. టీపీసీసీకి కొత్త సారథి వచ్చాక, ఆర్థిక బలంతో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుంది’’ అని పేర్కొన్నారు.
పీసీసీ చీఫ్ ఎంపిక అందరి సమన్వయంతో జరగాలని, ఆ పదవిలో సోనియా ఎవరిని నియమించినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. మరోసారి పార్టీ సీనియర్ల అభిప్రాయం తీసుకున్న తర్వాతే పీసీసీ చీఫ్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్పారు. సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.