క్షణక్షణం.. భయం భయం

ABN , First Publish Date - 2020-03-04T09:06:50+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడిన హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో గత కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలిగిన వారి సంఖ్య 88కి చేరింది. సోమవారం రాత్రినాటికి అలాంటివారిని 80 మందిని గుర్తించిన

క్షణక్షణం.. భయం భయం

కరోనా బాధితుడితో సన్నిహితంగా మెలిగినవారి సంఖ్య 88కి చేరిక

వారిలో 45 మంది ప్రస్తుతం గాంధీలో!

36 మందికి పరీక్షలు.. నేడు ఫలితం

2 వారాలు ఐసోలేషన్‌ వార్డులో ఉండాలి.. మరికొందరు ఇంట్లోనే 

ఫలితాలు పాజిటివ్‌ వస్తే ముప్పే.. ఆందోళనలో వైద్యులు, అధికారులు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ బారిన పడిన హైదరాబాదీ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో గత కొద్దిరోజులుగా సన్నిహితంగా మెలిగిన వారి సంఖ్య 88కి చేరింది. సోమవారం రాత్రినాటికి అలాంటివారిని 80 మందిని గుర్తించిన అధికారులు.. మంగళవారం మరో 8 మందిని గుర్తించారు. వారందరి వివరాలూ సేకరించారు. వారిలో 45 మంది ఇప్పటికే గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్యులు వారిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అతడు ప్రయాణించిన బస్సు డ్రైవర్‌, క్లీనర్‌, తోటి ప్రయాణికులు సహా మొత్తం 25 మందిని గుర్తించారు. అలాగే.. ఆ యువకుడి కుటుంబంలో అతడితో సన్నిహితంగా మెలిగినవారు 13 మంది ఉన్నట్లు గుర్తించారు.


వారిలో 36 మంది నమూనాలను సేకరించి పరీక్షకు పంపారు. అలాగే.. గాంధీ ఆస్పత్రికి రాకముందు అతడు సికింద్రాబాద్‌లో చికిత్స చేయించుకున్న ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది 50 మందిలో 42 మందిని ట్రేస్‌ చేయగలిగారు. మరో 8 మందిని ట్రేస్‌ చేయాల్సి ఉంది. సేకరించిన నమూనాలకు గాంధీ ఆస్పత్రిలోనే వైద్యపరీక్షలు నిర్వహించారు. ఫలితాలు బుధవారం రానున్నాయి. వారందరికీ నెగెటివ్‌ వస్తే ఊపిరిపీల్చుకోవచ్చని.. అలా కాకుండా పాజిటివ్‌ వస్తే మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఇలా పాజిటివ్‌ వచ్చినవారు ఎంత మందిని కలిశారో గుర్తించడం, వారందరికీ పరీక్షలు చేయించడం.. మళ్లీ వారు ఎంత మందిని కలిశారో.. వారిలో ఎవరికి వైరస్‌ సోకిందో గుర్తించడం.. ఇదంతా కష్టంతో కూడుకున్న పని.


ప్రస్తుతానికి గాంధీలో చేరిన 45 మందికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ రెండు వారాల ఐసోలేషన్‌కు తరలించారు. వారికి ఒకవేళ కరోనా నెగెటివ్‌ వచ్చినా.. వ్యాధి లక్షణాలు బయటపడటానికి రెండు వారాలు పడుతుంది కాబట్టి, ఆలోగా వైరస్‌ ఇతరులకు వ్యాపించకుండా ఉండేందుకే ఈ ముందు జాగ్రత్త చర్య. ఇక.. బాధితుడికి మరీ ఎక్కువగా సన్నిహితంగా మెలగని మరికొందరిని వారి వారి ఇళ్లల్లోనే ప్రత్యేక గదిలో ఉండి, రెండు వారాల పాటు బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.


ఇండిగో విమాన సిబ్బందిని కూడా..

కరోనా పాజిటివ్‌గా తేలిన హైదరాబాద్‌ యువకుడు ఫిబ్రవరి 20న దుబాయ్‌ నుంచి బెంగళూరుకు ఇండిగో విమానంలో వచ్చారు. ఈ నేపథ్యంలో.. ఆ రోజు విమానంలో సేవలందించిన సిబ్బందిని హోం ఐసోలేషన్‌లో ఉంచాల్సిందిగా ఎయిర్‌పోర్టు హెల్త్‌ ఆర్గనైజేషన్‌ (ఏపీహెచ్‌వో) ఇచ్చిన ఆదేశాల మేరకు.. నలుగురు సిబ్బందిని మార్చి 2 నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ విషయాన్ని ఇండిగో సంస్థ మంగళవారం ఒక ప్రకటన ద్వారా తెలిపింది. వారిని 15 రోజులపాటు పరిశీలనలో ఉంచనున్నారు.


కాగా.. బాధితుడిని తాకిన మొత్తం 88 మంది నమూనాలనూ కచ్చితంగా సేకరించి పరీక్షలకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ రాణే రాష్ట్ర మంత్రి ఈటలతో మంగళవారంనాడు ఫోన్‌లో మాట్లాడారు. రోగి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని హామీనిచ్చారు.


రంగంలోకి 500 మంది..

హైదరాబాద్‌ కరోనా బాధితుడిని గత కొద్దిరోజుల్లో కలిసినవారి వివరాలను సేకరించేందుకు ఏకంగా 500 మంది వైద్య ఆరోగ్య సిబ్బంది మంగళవారం రంగంలోకి దిగారు. సెకండరీ కాంటాక్టులపై దృష్టిపెట్టారు. అంటే.. ఆ 88 మందీ ఎవరెవరితో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి? వారంతా ఎక్కడున్నారు? అన్న దానిపై  క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా సోమవారం విదేశాల నుంచి కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చి గాంధీలో నమూనాలు ఇచ్చిన ఏడుగురి శాంపిల్స్‌ నెగిటివ్‌గా వచ్చాయి.


క్వారంటైన్‌తోనే అడ్డుకట్ట ఇటలీ వైద్యనిపుణుడి వెల్లడి

మిలన్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్‌-19 వ్యాప్తిని అడ్డుకోవాలంటే.. ఆ వైరస్‌ బారిన పడినవారిని, అనుమానితులను క్వారంటైన్‌ లో (ఎవరితో కలవకుండా కొన్నిరోజులపాటు విడిగా) ఉంచి తగిన జాగ్రత్తలతో చికిత్స చేయడం ఒక్కటే మార్గమని ఇటలీకి చెందిన వైద్యనిపుణుడు మసిమో గల్లీ తేల్చిచెప్పారు. కరోనాను నిలువరించే వాక్సిన్‌ తయారీని వేగవంతం చేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రకటన.. ఆ టీకా కోసం ప్రపంచమంతా ఆందోళనగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

Updated Date - 2020-03-04T09:06:50+05:30 IST