కరోనాపై మీ సందేశానికి ధన్యవాదాలు

ABN , First Publish Date - 2020-04-05T08:06:33+05:30 IST

కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ తరఫున చిరంజీవి, నాగార్జున, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఓ మ్యూజిక్‌ వీడియో...

కరోనాపై మీ సందేశానికి ధన్యవాదాలు

  • చిరు బృందానికి ప్రధాని ప్రశంస

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 4: కరోనా మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ తరఫున చిరంజీవి, నాగార్జున, వరుణ్‌ తేజ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఓ మ్యూజిక్‌ వీడియో చేశారు. సంగీత దర్శకుడు కోటి స్వరపరచిన ఆ పాటలో ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉంటూ సామాజిక దూరం, పరిశుభ్రత పాటిస్తూ కరోనాపై యుద్ధం చేద్దామని సందేశాన్నిచ్చారు. చిరంజీవి బృందం చేసిన ఈ కృషిని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. ‘‘మీరందరూ ఇచ్చిన చక్కని సందేశానికి నా ధన్యవాదాలు. అందరం మన ఇళ్లలో ఉందాం. సామాజిక దూరం పాటిద్దాం. కరోనా వైర్‌సపై విజయం సాధిద్దాం’’ అని మోదీట్విటర్‌లో ప్రశంసించారు. ఆయనకు చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. ‘‘కరోనా సంక్షోభం వల్ల దేశానికి కలిగిన నష్టాన్ని నివారించడానికి విరామం లేకుండా మీరు చేస్తున్న కృషిని అభినందిస్తున్నాను. ఈ బృహత్తర కార్యక్రమంలో మా వంతుగా చిన్న సహాయం చేశాం. మా తరఫున మీకు ధన్యవాదాలు’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ప్రధాని మోదీ ఆదివారం రాత్రి దీపాలు వెలిగించమని ఇచ్చిన పిలుపునకు మెగాస్టార్‌ చిరంజీవి మద్దతు పలికారు.


ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ‘‘మీ పత్రిక ద్వారా ఈ సమయంలో ప్రతి ఒక్కరినీ వేడుకుంటున్నా.. ప్రధాని పిలుపు మేరకు మనమంతా ఈ రోజు రాత్రి 9 గంటలకు, 9 నిమిషాల పాటు ఎవరింట్లో వాళ్లు ఉండి దీపాలు, కొవ్వొత్తులు, సెల్‌ఫోన్‌ ఫ్లాష్‌లు, టార్చ్‌లైట్లతో ‘కరోనా మహమ్మారిని తరమడానికి భారతీయులంతా ఒక్కటయ్యాం’ అని ప్రపంచ దేశాలకు తెలియజెప్పాల్సిన సమయమిది’’ అని అన్నారు. మోదీ కోరినట్లుగా దీపాలు వెలిగించి ఐకమత్యంతో కరోనాపై మన పోరాటం కొనసాగుతుందని చాటిచెబుదామని నాగార్జున పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-05T08:06:33+05:30 IST