హైదరాబాద్: మొబైల్ ఇళ్ల తయారీతో ఆకట్టుకుంటున్న జిలానీ
ABN , First Publish Date - 2020-04-07T15:58:17+05:30 IST
కృషి, పట్టుదల ఉంటే ఎంతటి పనినైనా సాధించొచ్చని నిరూపిస్తున్నాడు ఓ క్రియేటర్.

- కరోనా నేపథ్యంలో పోలీసులకు సాయంగా తాత్కాలిక గదులు
- దూలపల్లి జంక్షన్, సుచిత్ర చౌరస్తాలో ఏర్పాటు
- త్వరలో అందుబాటులోకి బస్తీ మొబైల్ దవాఖాన
హైదరాబాద్/పేట్‌బషీరాబాద్ : కృషి, పట్టుదల ఉంటే ఎంతటి పనినైనా సాధించొచ్చని నిరూపిస్తున్నాడు ఓ క్రియేటర్. గుంటూరు జిల్లా నిజాంపట్నం ప్రాంతానికి చెందిన ఎస్‌కే జిలానీ కొన్నేళ్ల క్రితం మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ నగరశివారులోని దూలపల్లి పారిశ్రామికవాడలో ఫ్యాబ్రికేషన్ పనులతో పాటు క్రేన్ మరమ్మతులు చేస్తూ స్థానికంగా స్ధిరపడ్డాడు. కొన్ని నెలల క్రితం జిలానీ క్రేన్ మరమ్మతు పనుల్లో భాగంగా విదేశాలకు వెళ్లిన సమయంలో ఆయనకు మొబైల్ హౌస్‌లు కనిపించాయి. స్వతహాగా నూతన ఆవిష్కరణలపైఆసక్తి కలిగిన జిలానీ మొబైల్ హౌస్‌ల తయారీని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. దేశంలో మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగాపేరొందిన గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మొబైల్ ఇళ్లను రూపొందించి తన ప్రత్యేకతను చాటుకోవాలని ఆకాంక్షించారు.
ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌస్‌ల తయారీ..
నగరంలోని దూలపల్లిలో క్రేన్ల సాయంతో ఎక్కడికంటే అక్కడికి సులువుగా తరలించే విధంగా ఉండే ఫ్యాబ్రికేటెడ్ మొబైల్ హౌస్‌ల తయారీని కొన్ని రోజుల క్రితం ప్రారంభించారు. దాదాపు 20 రోజుల్లో 20 నుంచి మంది సౌకర్యవంతంగా కూర్చునే పెద్ద ఇంటిని కలప, ఇనుప కడ్డీలతో తయారు చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ కొనసాగుతోంది.
ఈ క్రమంలో నగరంలోని దూలపల్లి చౌరస్తా, సుచిత్ర చౌరస్తాలో వాహనదారులు, జన సమూహాలను కట్టడి చేసేందుకు రోడ్ల పక్కన 24 గంటలపాటు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సాయంగా రెండు మొబైల్ హౌస్‌లను అందుబాటులో ఉంచారు. మొబైల్ ఇళ్లల్లో వాటర్‌ట్యాంకు, విద్యుత్‌ను ఏర్పాటు చేయడంతోపాటు కిచెన్, బాత్‌రూమ్, వాష్‌బేసిన్, షవర్, ఫ్యాను, లైట్లకు వైరింగ్, సోఫాసెట్లు, బెడ్లను కూడా ఏర్పాటు చేశారు. జిలానీ చేస్తున్న వెరైటీ ఇంటి నమూనాలు చూసి ఫామ్‌హౌస్, క్లబ్బులు, పార్కుల యజమానులు, గ్రామీణ విద్యావంతులు ఆర్డర్లు ఇస్తూ ఉండడంతో బిజీగా మారాడు.