మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్స్‌తో ఇంటి వద్దకే చేపల సరఫరా

ABN , First Publish Date - 2020-12-19T20:32:52+05:30 IST

చేపలంటే లొట్టలేసుకుని తినే వారి సంఖ్య తక్కువేం కాదు. చేపలు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.

మొబైల్‌ ఫిష్‌ ఔట్‌లెట్స్‌తో ఇంటి వద్దకే చేపల సరఫరా

హైదరాబాద్‌: చేపలంటే లొట్టలేసుకుని తినే వారి సంఖ్య తక్కువేం కాదు. చేపలు తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. అయితే చేపల మార్కెట్‌లకు వెళ్లేందుకు ఇష్టపడని వారికి ఇప్పుడు శుభవార్త. ప్రభుత్వం నేరుగా ఇంటి వద్దకే చేపలను అందించేందుకు మొబైల్‌ ఫిష్‌ఔట్‌లెట్స్‌ను ప్రవేశ పెడుతోంది. నిరుద్యోగ, స్వయం ఉపాధి మహిళా గ్రూపులకు జీవనోపాఽధి కల్పించేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న జీహెచ్‌ఎంసి పరిఽధిలోని 150 వార్డుల్లో వినియోగ దారులకు ఇంటివద్దకే పరిశుభ్రమైన , ఆరోగ్యకరమైన చేపలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 


అందులో భాగంగానే జాతీయ మత్స్య అభివృద్ధి సంస్ధ సహకారంతో మొదటి విడతగా జీహెచ్‌ఎంసి పరిధిలోని 50 వార్డుల్లో నిరుద్యోగ మహిళా గ్రూపులకు 50 సంచార మత్స్య విక్రయ వాహనాలను అందించాలని నిర్ణయించింది. సంచార చేపల విక్రయశాల యూనిట్‌ ధర 10లక్షల రూపాయలు, ఇందులో 60శాతం ప్రభుత్వం సబ్సిడీగా ఇవ్వనుంది. మిగిలిన 40శాతం లబ్ధిదారులు వాటాగా చెల్లించాలి. రెండో విడతగా జీహెచ్‌ఎంసి పరిధిలోని మిగిలిన 100 వార్డుల్లో వార్డుకు ఒకటి చొప్పున 100 సంచార వాహనాలను నిరుద్యోగ మహిళా గ్రూపులకు అందించనున్నారు. 


ఆసక్తిగల మహిళా సంఘాలు (3 నుంచి 5 మంది సభ్యులు) అర్హత కలిగిన ప్రమాణాలు, మార్గదర్శకాలకు లోబడి నిర్ణీత దరఖాస్తుఫారాలలో దరఖాస్తు చేసుకోవాలి. మాసాబ్‌టాంక్‌లోని మత్స్యశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లా మత్స్యశాఖ కార్యాలయంలో దరఖాస్తుఫారాలు అందుబాటులో ఉంచినట్టుఅధికారులు తెలిపారు. ఈనెల 19వ తేదీ నుంచి జనవరి 10వ తేదీ వరకూ దరఖాస్తులను పంపుకోవచ్చు. 

Updated Date - 2020-12-19T20:32:52+05:30 IST