ఇది తోలు మందం సర్కారు..

ABN , First Publish Date - 2020-12-18T04:06:59+05:30 IST

ఇది తోలు మందం సర్కారు..

ఇది తోలు మందం సర్కారు..
హన్మకొండలో ఉపాధ్యాయుల నిరాహార దీక్షలో మాట్లాడుత్ను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

 ముల్లుకట్టెతో పొడిస్తేనే సమస్యల పరిష్కారం

 ఎమ్మెల్సీ అలుగుబెల్లి  నర్సిరెడ్డి 

 జాక్టో, యూఎ్‌సపీసీ నిరాహార దీక్షకు సంఘీభావం


వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, డిసెంబరు 17: రాష్ట్ర ప్రభుత్వానికి తోలు మందమైందని, ముల్లుకట్టెతో గట్టిగా పొడిస్తేనే దారికొచ్చి సమస్యలు పరిష్కరిస్తుందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఉపాధ్యాయుల పీఆర్‌సీ, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల జాక్టో, యూఎ్‌సపీసీ ఆధ్వర్యంలో హన్మకొండలోని ఏకశిల పార్కు వద్ద ఉపాధ్యాయులు గురువారం నిరాహార దీక్ష చేపట్టారు. వీరికి సంఘీభావం తెలిపిన అనంతరం నర్సిరెడ్డి మాట్లాడుతూ... కమీషన్ల కోసం ఢిల్లీ, గల్లీల్లో పనులు చేసుకునే సీఎం కేసీఆర్‌కు రాష్ట్రంలోని ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పట్టడం లేదని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచిన ఇద్దరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. 


ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తలకిందులుగా వ్యవహరిస్తోందన్నారు. ఉపాధ్యాయులంతా ఏకతాటిపైకి వచ్చి ఐక్య ఉద్యమాలు చేస్తేనే డిమాండ్లు నెరవేరుతాయని, అందుకే తాను ఎల్లప్పుడూ ఉపాధ్యాయుల వెంటే ఉంటానన్నారు. ప్రజాసంక్షేమాన్ని పట్టించుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయన్నారు. కేంద్ర వ్యవసాయ బిల్లులతో అదానీ, అంబానీల ఆదాయాలే పెరుగుతాయని, రైతులు ప్రమాదంలో పడే అవకాశముందని తెలిపారు. 


ఉద్యోగ ప్రకటనలతో మరోసారి రాష్ట్ర ప్రభుత్వం షో చేస్తోందని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి విమర్శించారు. ఈనెల 29న జాక్టో, యూఎ్‌సపీసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నా కంటే ముందే కేసీఆర్‌ ఉపాధ్యాయులకిచ్చిన హామీలపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు సమాజ దిశా నిర్ధేశకులని, వారంంతా సంఘటితంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు పాలకులకు తొత్తులుగా మారి వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడుతున్నారని విమర్శించారు. 


జాక్టో, యూఎ్‌సపీసీ రాష్ట్ర స్టీరింగ్‌ నాయకులు టి.లింగారెడ్డి, ఎం.గంగాధర్‌, బి.రవి, ఆర్‌.సుధాకర్‌రెడ్డి, కె.సోమశేఖర్‌, ఎన్‌.తిరుపతి, బి.రమేష్‌ మాట్లాడుతూ... పీఆర్‌సీ అమలు చేయాలని, పండిట్‌లను అప్‌గ్రేడ్‌ చేసి, పీఈటీలతో పాటు అన్ని కేటగిరీల పదోన్నతులను, సాధారణ, అంతర జిల్లా బదిలీలను చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ, టీఎ్‌సయూటీఎఫ్‌, టీపీటీఎఫ్‌, డీటీఎఫ్‌, ఎస్‌ఎల్‌టీఏ, టీజీపీఈటీఏ, ఎం ఎ్‌సటీఎఫ్‌ సంఘాల నాయకులు సదయ్య, రాంబాబు, రవీందర్‌రాజు, వెంకట్‌రెడ్డి రాజు, సోమేశ్వర్‌రావు, లక్ష్మీపతి, శ్రీనివాసు, దేవదాసు, రమేష్‌, నారాయణ, కరుణార్‌, స్వామి, భోగేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T04:06:59+05:30 IST