కరోనా నుంచి కోలుకుంటున్న ఎమ్మెల్యేలు!

ABN , First Publish Date - 2020-06-26T08:12:18+05:30 IST

రాష్ట్రంలో భారీ సంఖ్యలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నేతలను కూడా కలవరపెడుతున్నాయి.

కరోనా నుంచి కోలుకుంటున్న ఎమ్మెల్యేలు!

చివరి దశకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల క్వారంటైన్‌

ఆస్పత్రిలోనే వీహెచ్‌.. కాంగ్రెస్‌లో మరో నలుగురికి


హైదరాబాద్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ సంఖ్యలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలతో పాటు రాజకీయ పార్టీల నేతలను కూడా కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఇద్దరు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు, ఒక మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. వారిలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోలుకున్నారు. కొందరికి బీపీ, షుగర్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధులున్నప్పటికీ కోలుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బాజిరెడ్డి గోవర్దన్‌, బిగాల గణేష్‌ గుప్తా చికిత్స పొందుతున్నారు. ముత్తిరెడ్డికి ఈ నెల 12న, బాజిరెడ్డికి 14న, గణేష్‌ గుప్తాకు 15వ తేదీన కరోనా నిర్ధారణ అయింది. ముత్తిరెడ్డి, ఆయన భార్య, వంట మనిషి, ఇద్దరు గన్‌మెన్‌లు వైరస్‌ బారిన పడ్డారు. ముత్తిరెడ్డి యశోద ఆస్పత్రిలో 4 రోజులు చికిత్స పొంది ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం ఆయనతో పాటు మిగతా వారి ఆరోగ్యం నిలకడగా ఉంది. వైరస్‌ తీవ్రత తగ్గుతోంది. మరో 3, 4 రోజుల్లో క్వారంటైన్‌ గడువు కూడా ముగియనుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాజిరెడ్డి, ఆయన భార్య యశోద ఆరోగ్యం కూడా నిలకడగా ఉంది. ఇక, మరో టీఆర్‌ఎస్‌ ఎమ్మె ల్యే గణేష్‌ గుప్తా హైదరాబాద్‌లోని తన నివాసంలోనే చికిత్స పొందుతున్నారు. మరో 3, 4 రోజుల్లో వీరి ఆరోగ్యం కూడా సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 


కాంగ్రెస్‌ పార్టీకి కరోనా గుబులు!

కాంగ్రెస్‌ పార్టీలో ఇద్దరు సీనియర్‌ నాయకులకు కరోనా సోకింది. మాజీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంత రావు, ఆయన భార్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిద్దరి ఆరోగ్యం కూడా నిలకడగానే ఉందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వైరస్‌ నిర్ధారణ అయినప్పటి నుంచి వీహెచ్‌కు సాధారణ లక్షణాలే ఉన్నాయి. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి కూడా వైరస్‌ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్‌ఎ్‌సయూఐ అధ్యక్షుడు వెంకట్‌ సహా మరో ముగ్గురు ముఖ్య నేతలకు కూడా కరోనా సోకింది. దీంతో ఇటీవల పార్టీ కార్యక్రమాలకు హాజరైన నేతలు స్వీయ క్వారంటైన్‌లోకి వెళ్లారు.


రాజాసింగ్‌ సిబ్బందికి కరోనా!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సిబ్బందికి కరోనా వైరస్‌ సోకింది. మొదట ఆయనకు కూడా పాజిటివ్‌ అని ప్రచారం జరిగింది. అయితే పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌ అని తేలింది. ఆయన వద్ద డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరికి, ముగ్గురు గన్‌మెన్‌లకు వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. తన వద్ద పనిచేస్తున్న వారిలో మరో ఐదుగురు సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించారు. వాటి ఫలితాలు రావాల్సి ఉంది.


ఏపీలో మరో ఎమ్మెల్యేకి కరోనా కర్నూలు జిల్లాలో కల్లోలం 


విజయనగరం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కరోనా బారిన పడిన రెండు రోజులకే కర్నూలు జిల్లాలో మరో ఎమ్మెల్యేకి సైతం పాజిటివ్‌ అని తేలింది. ఇటీవలే అసెంబ్లీ సమావేశాలకు అమరావతి వెళ్లిన ఆయన ఈ నెల 18న సీఎం జగన్‌ను కలిసి నియోజకవర్గ సమస్యలపై కొంతసేపు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. తర్వాత జిల్లాకు చేరుకున్న ఆయన పలు పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవారం అనంతపురం జిల్లాకు వెళ్లొచ్చారు. బుధవారం గూడూరు మండల కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండగా జ్వరంతో బాధపడుతూ వెళ్లలేకపోయారు. వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యాధికారులు గురువారం సాయంత్రానికి పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉండగా, నిత్యం వెంట ఉండే గన్‌మన్‌, డ్రైవర్‌ కూడా హోం క్వారంటైన్‌కు వెళ్లారు.

Updated Date - 2020-06-26T08:12:18+05:30 IST