ప్రభుత్వాలది అప్రజాస్వామిక పాలన
ABN , First Publish Date - 2020-10-03T11:08:31+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ..

రాహుల్‌గాంధీ అరెస్టు అక్రమం
కాంగ్రెస్ ఆందోళనలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
భూపాలపల్లి టౌన్, అక్టోబరు 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం కిసాన్ మజ్దూర్ బచావో దివాస్ కార్యక్రమం జిల్లా అధ్యక్షుడు ఐత ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతుల హక్కులను ఆదానీ, అంబానీలకు ప్రధాని నరేంద్రమోదీ తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలోనే రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టారన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైతులకు మేలు చేసే అనేక చట్టాలను అమలు చేసినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిచేలా రైతుల హక్కులను బడా పారిశ్రామిక వేత్తలకు తాకట్టు పెట్టేందుకు నూతన చట్టాలను తీసుకురావాలని చూస్తుందన్నారు.
రాష్ట్ర శాసనసభలో బిల్లు ఆమోదం కాకుండా తీర్మానం చేయవచ్చు కదా అని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. రైతు వ్యతిరేక బిల్లులకు పరోక్షంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మద్దతు పలుకుతుందని ఆరోపించారు. పైగా రాక్షస పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ అనేక వాగ్ధానాలు చేసి రెండోసారి అధికారంలోకి వచ్చాక దళితులకు మూడెకరాల భూమి, నిరుద్యోగ భృతి, పేదలకు పక్కాగృహలు మర్చిపోయారని విమర్శించారు. త్వరలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని శ్రీధర్‌బాబు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్, నాయకులు చల్లూరి మధు, ఎంపీపీలు పంతకాని సమ్మయ్య, మల్హల్‌రావు, జడ్పీటీసీ అరుణ, ఐఎన్‌టీయూసీ నాయకుడు బుచ్చయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీధర్‌బాబు అరెస్టు, విడుదల
కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ భూపాలపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. సుమారు గంట పాటు రాస్తారోకో జరగ్గా వాహనాలు కిలోమీటరు మేరనిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించడమే కాకుండా అక్రమంగా అరెస్టులు చేయడంపై శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు శ్రీధర్‌బాబును అరెస్టు చేసి కొద్ది సేపటికి విడుదల చేశారు.