‘మార్క్‌ఫెడ్’ రణరంగం!
ABN , First Publish Date - 2020-03-08T09:45:01+05:30 IST
మార్క్‌ఫెడ్ పాలకవర్గ సభ్యుల ఎన్నిక రణరంగంగా మారింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అటు కాంగ్రెస్, ఇటు

డైరెక్టర్ పదవుల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జులుం..
పీఏసీఎస్ చైర్మన్లపై ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి దాడి
చొక్కా, నామినేషన్ పత్రాలు చించి, మెడపట్టి గెంటివేత..
ముగ్గురు సొసైటీ చైర్మన్ల కిడ్నాప్
సొంత పార్టీ నేతపై చేయిచేసుకున్న ఎమ్మెల్యే..
డైరెక్టర్లుగా నామినేషన్లు వేయకుండా అడ్డగింత
మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలోనే హై డ్రామా..
అసెంబ్లీకి చేరిన వివాదం; కేటీఆర్ సమీక్ష
హైదరాబాద్, మార్చి 7(ఆంధ్రజ్యోతి): మార్క్‌ఫెడ్ పాలకవర్గ సభ్యుల ఎన్నిక రణరంగంగా మారింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అటు కాంగ్రెస్, ఇటు సొంత పార్టీ పీఏసీఎస్ ఛైర్మన్లపై దాడికి దిగారు. నల్లగొండ జిల్లా మునుగోడు పీఏసీఎస్ ఛైర్మన్ కుంభం శ్రీనివా్‌సరెడ్డి (కాంగ్రెస్) నామినేషన్ పత్రాలు, గుర్తింపు కార్డులు, చొక్కా చించి మెడపట్టి బయటకు గెంటేశారు. సొంత పార్టీ, సొంత జిల్లాకు చెందిన పెంటాకుర్దు (బోధన్) పీఏసీఎస్ ఛైర్మన్ అమర్‌నాథ్‌బాబుపైనా ముష్టి ఘాతాలకు దిగారు. మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఘటనల్లో ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల మేరకు..
నామినేషన్ ఎందుకేస్తావ్? ఎలా వేస్తావ్?
మార్క్‌ఫెడ్‌లో ఏడుగురు డైరెక్టర్ల ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ శనివారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైంది. టీఆర్‌ఎస్ అధిష్ఠానం అభ్యర్థులను శుక్రవారమే ఖరారు చేసి ఎన్నిక ఏకగ్రీవం చేయాలని ఆదేశించింది. దీంతో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కార్యాలయానికి వచ్చారు. అంతకుముందు ఇద్దరికి నచ్చజెప్పి పోటీ విరమింపజేశారు. మరోవైపు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పెంటాకుర్దు పీఏసీఎస్ ఛైర్మన్ అమర్‌నాథ్‌బాబు నామినేషన్ ఫారం తీసుకోబోగా నిరంజన్‌రెడ్డి వారించారు. ‘నేనైతే పత్రాలు నింపిస్తా. మీరేమైనా చేసుకోండి’ అని ఆయన స్పష్టం చేశారు. కాసేపటికి ప్రతిపాదకులుగా ఇద్దరు సొసైటీ చైర్మన్లను తోడ్కొని వచ్చి నామినేషన్ వేయబోయారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడించాక వెనక్కు తగ్గారు. కానీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి జోక్యం చేసుకుని.. ‘నామినేషన్ ఎందుకేస్తావ్? ఎలా వేస్తావ్?’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. మాటా మాట పెరిగి అమర్‌నాథ్ బాబుపై చేయి చేసుకున్నారు.
అధికారులు, పోలీసుల ప్రేక్షక పాత్ర
ఇంత జరుగుతున్నా మార్క్‌ఫెడ్ ఎన్నికల అధికారి, జాయింట్ రిజిస్ట్రార్ అరుణ, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షించినా పట్టనట్లు వ్యవహరించారు. అభ్యర్థులను మాత్రమే కార్యాలయం లోపలకు పంపాల్సి ఉండగా నిజామాబాద్, ఆర్మూర్ నుంచి వందలాది మందిని వదిలేశారు. శ్రీనివా్‌సరెడ్డి ఎన్నికల అఽధికారి ఎదుట బైఠాయించినా పట్టించుకోలేదు. ఆయన పత్రాలను ఎమ్మెల్యే చించివేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ తంతును ఓ కానిస్టేబుల్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించగా, ఆర్మూర్ నాయకులు తొలగింపజేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిశాక మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అసెంబ్లీలో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. వారి మధ్య ఎన్నిక సందర్భంగా జరిగిన సంఘటనలు సమీక్షకు వచ్చాయి. అమర్‌నాథ్‌బాబును కూడా పిలిపించి మాట్లాడారు.
కారులో కుదేసి.. నగరమంతా తిప్పి
మరోవైపు కుంభం శ్రీనివా్‌సరెడ్డి నామినేషన్, ప్రపోజల్ పత్రాలు తీసుకుంటుండగా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అటకాయించారు. ‘నేను నామినేషన్ వేస్తా. అవసరమైతే తర్వాత కూర్చుని మాట్లాడదాం. అంత ఇబ్బందైతే విత్‌డ్రా చేసుకుంటా’ అని శ్రీనివా్‌సరెడ్డి బదులిచ్చారు. అయినా ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నేతలు వినలేదు. శ్రీనివా్‌సరెడ్డి సొసైటీ గుర్తింపు, ఆధార్, పాన్ కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్, గెజిటెడ్ అటెస్టెడ్ పత్రాలను లాక్కుని చించివేశారు. ‘మీకెందుకు రా పదవులు? మీరెందుకు రా నామినేషన్లు వేసేది?’ అంటూ పరుష పదజాలంతో దూషించారు. శ్రీనివా్‌సరెడ్డి మెడ, కాళ్లు, చేతులు మడిచి పట్టుకుని కార్యాలయం బయటకు లాక్కొచ్చారు.
ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచటానికి వచ్చిన నల్గొండ జిల్లా నాంపల్లి పీఏ సీఎస్ చైర్మన్ నర్సిరెడ్డి, ఆత్మకూర్ చైర్మన్ శేఖర్‌రెడ్డిపైనా దాడికి దిగారు. ఈ ఇద్దరు చైర్మన్లతో పాటు కాంగ్రెస్ నాయకుడు గోవర్ధన్‌రెడ్డిని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరులు కిడ్నాప్ చేశారు. కార్లో కుదేసి మొజాంజాహీ మార్కెట్ రోడ్డులో తీసుకెళ్లారు. నగరమంతా తిప్పి, నామినేషన్ల దాఖలు సమయం ముగిశాక మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మార్క్‌ఫెడ్ కార్యాలయం బయట వదిలేశారు. ఈ హైడ్రామా ఉదయం 11.45 గంటలకు మొదలై మధ్యాహ్నం 1.15 వరకు సాగింది.
ఏకగ్రీవంగా ఎన్నికలు
ఏడు డైరెక్టర్ల స్థానాలకు రేకుల గంగాచరణ్, ఎస్.జగన్మోహన్‌రెడ్డి, బొర్రా రాజశేఖర్, మర్రి రంగారావు, మార గంగారెడ్డి, ఎన్.విజయ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కరీంనగర్ జిల్లా పీఏసీఎస్ ఛైర్మన్ హాజరుకాలేదు. ఈ నెల 11తేదీన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం అంకాపూర్ పీఏసీఎస్ ఛైర్మన్ మార గంగారెడ్డిని ఛైర్మన్ అభ్యర్థిగా సీఎం ఖరారు చేశారు.