మిక్సింగ్‌ మాఫియా

ABN , First Publish Date - 2020-04-25T09:11:31+05:30 IST

గొర్రె, మేక మాంసంలో బీఫ్‌ ఇతర మాంసం కలిపి విక్రయించే దృశ్యాలు సోషల్‌ మీడియాలో తరచుగా చూస్తుంటాం.

మిక్సింగ్‌ మాఫియా

గొర్రె, మేక మాంసంలో బీఫ్‌ కలగలిపి అమ్ముతున్న వ్యాపారులు

రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు 

జీహెచ్‌ఎంసీలో 3 రోజులుగా తనిఖీలు 

త్వరలోనే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): గొర్రె, మేక మాంసంలో బీఫ్‌ ఇతర మాంసం కలిపి విక్రయించే దృశ్యాలు సోషల్‌ మీడియాలో తరచుగా చూస్తుంటాం. అచ్చంగా హైదరాబాద్‌లో ఇదే తరహా దందా జరుగుతున్నట్లు వెటర్నరీ శాఖ అధికారులు ధ్రువీకరించారు. మాంసం అమ్మకాలు, అక్రమాలు, అధిక ధరలపై పరిశీలన కోసం పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డా.బాబు బేరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన వెటర్నరీ అధికారుల కమిటీ మూడు రోజులుగా జీహెచ్‌ఎంసీలో విస్తృత తనిఖీలు చేస్తోంది.


ఈ పరిశీలనలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అసి్‌ఫనగర్‌, బార్కాస్‌, మణికొండ, జియాగూడ, గోల్కొండ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్‌, ఉప్పల్‌, అంబర్‌పేట్‌, నాంపల్లి, రెడ్‌హిల్స్‌, అమీర్‌పేట్‌ తదితర ప్రాంతాల్లోని పలు మటన్‌ దుకాణాల్లో బీఫ్‌(గొడ్డు మాంసం) అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలా గుర్తించిన ఓ చోట క్వింటాలు మటన్‌పై ఫినాయిల్‌ పోశారు. 62 మాంసం దుకాణాలను తనిఖీ చేస్తే.. వాటిలో 50 మటన్‌ దుకాణాలకు లైసెన్సులే లేవు. మరికొందరేమో చికెన్‌షాపు పేరిటమటన్‌ అమ్ముతున్నారు. జీహెచ్‌ఎంసీ నుంచి మటన్‌ షాపులకు లైసెన్సు తీసుకోవాల్సి ఉండగా రెండు, మూడు నెలలకోసారి నామమాత్రపు జరిమానా చెల్లిస్తూ దుకాణాలను నడిపిస్తున్నారు. ఈ తరహా దందా కొన్నేళ్లుగా జరుగుతున్నట్టు తెలుస్తోంది.


మటన్‌ 700, చికెన్‌ 160

అడ్డగోలుగా పెరుగుతున్న మాంసం ధరలకు కళ్లెం వేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. పైగా కరోనా విపత్తు సమయంలో కిలో మటన్‌ రూ.800  నుంచి రూ.950 వరకు అమ్ముతున్నారు. కొన్ని మాల్స్‌ లో రూ.1,000  నుంచి రూ.1,100 వరకు కూడా అమ్ముతున్నట్లు వెటర్నరీ అధికారుల కమిటీ గుర్తించింది. దీనిపై రాష్ట్ర పశసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌, ప్రభుత్వ కార్యదర్శి అనితా రాజేంద్ర, ఇతర అధికారులతో చర్చించి మాంసం ధరలను ఖరారు చేశారు. మటన్‌ కిలో రూ. 700, చికెన్‌ కిలో రూ. 160 కి మించి అమ్మొద్దని ఆదేశాలు జారీ చేశారు. షాపుల వద బోర్డులు కూడా ఏర్పాటు చేయిస్తున్నారు. అయితే వ్యాపారులు అధికారుల ముందు బోర్డులు పెట్టి, తర్వాత రూ. 800 పైచిలుకు ధరతో అమ్ముతున్నట్లు గుర్తించారు.


ఇలా చేసినందుకు రెడ్‌హిల్స్‌లో ఓ మటన్‌ వ్యాపారిపై శుక్రవారం కేసు నమోదు చేశారు. వ్యాపారులు మాంసాన్ని సగటున కిలో రూ.350 నుంచి రూ.450 వరకు కొంటున్నారు. వినియోగదారులకు మాత్రం రెండింతల కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. మాంసానికి తోడు తల, కాళ్లు, తోలు, పొట్ట పేగులు వేరుగా విక్రయించటం ద్వారా గొర్రెలు, మేకలు కొనటానికి పెట్టిన పెట్టుబడిపై మూడింతల ఆదాయాన్ని పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. 


విచారణకు ఇద్దరు వ్యాపారులు

వెటర్నరీ అధికారుల సిఫార్సు మేరకు ఐదుగురు వ్యాపారులపై జీహెచ్‌ఎంసీ అధికారులు కేసులు నమోదు చేశారు. వారిలో గాంధీనగర్‌కు చెందిన ఇద్దరిని ప్రాసిక్యూట్‌ చేశారు. అదే క్రమంలో ఒక కంపెనీ బ్రాండ్‌తో రూ.1,100కు కిలో మటన్‌ అమ్ముతున్న సంస్థను గుర్తించి, కేసు నమోదు కోసం జీహెచ్‌ఎంసీకి రెఫర్‌ చేశారు. 


3 రోజుల్లో నివేదిక..  పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బాబు బేరి  

మాసం దుకాణాలు, ప్రభుత్వ స్లాటర్‌ హౌజ్‌లు, అక్రమ స్లాటర్‌ హౌజ్‌లు, మాంసం రవాణా, గొర్రెలు, మేకలు కోస్తున్న తీరు.. అన్నీ పరిశీలన చేస్తున్నాం. చాలా చోట్ల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మటన్‌లో బీఫ్‌ కలుపుతున్నట్లు తనిఖీల్లో తేలింది. అలాంటి వ్యాపారులను గుర్తించి టాస్క్‌ఫోర్స్‌కు అప్పగించాం. అన్ని అంశాలపై  3 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం. మాంసం విక్రయాలను వెటర్నరీ శాఖ పరిధిలోకి తీసుకొచ్చే విధానంపై సిఫార్సులు చేస్తాం.


Updated Date - 2020-04-25T09:11:31+05:30 IST