న్యూ సిటీలో మిశ్రమ ఫలితాలు
ABN , First Publish Date - 2020-12-05T09:00:17+05:30 IST
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో న్యూసిటీ మిశ్రమ ఫలితాలనిచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో ఉత్తరం, పశ్చిమం టీఆర్ఎస్ వైపు నిలువగా, ఈస్ట్,

ఉత్తరం, పశ్చిమంలో గులాబీ జోరు
ఈస్ట్, సెంట్రల్లో కమల వికాసం
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): జీహెచ్ఎంసీ ఎన్నికల్లో న్యూసిటీ మిశ్రమ ఫలితాలనిచ్చింది. గ్రేటర్ ఎన్నికల్లో ఉత్తరం, పశ్చిమం టీఆర్ఎస్ వైపు నిలువగా, ఈస్ట్, సెంట్రల్లో కమలం వికసించింది. ఐదేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో న్యూసిటీలో పూర్తిగా గులాబీ గుబాళించగా, ప్రస్తుత ఎన్నికల్లో అందుకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. పార్టీలు వేసుకున్న అంచనాలు కూడా తారుమారయ్యాయి.
పాతబస్తీ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లోనూ టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా పలు స్థానాలను దక్కించుకున్నాయి. ఉత్తరాన గల సికింద్రాబాద్, కూకట్పల్లి జోన్లతో పాటు పశ్చిమాన గల శేరిలింగంపల్లి జోన్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మెరుగైన స్థానాలను సాధించింది. నిరుడి ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొన్ని స్థానాలు చేజారినా టీఆర్ఎస్ తన పట్టును నిలుపుకొంది.
శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్భుల్లాపూర్లలో ఆ పార్టీకి మెరుగైన స్థానాలు దక్కాయి. ఒకటి, రెండు స్థానాలను బీజేపీ చేజార్చుకున్నది. ఐటీ కారిడార్ పూర్తిగా టీఆర్ఎస్ వశమవుతుందని ముందు నుంచి భావించగా, ఇందులో రెండు డివిజన్లు మినహా మిగతా స్థానాల్లో టీఆర్ఎస్ పట్టు నిలుపుకొంది. ఈ ప్రాంతంలో అధికంగా ఏపీకి చెందిన సెటిలర్లతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన సెటిలర్లు అధికంగా ఉన్నారు. అయితే ఏపీకి చెందిన సెటిలర్లు దాదాపుగా టీఆర్ఎస్ వెన్నంటే ఉన్నట్లు ఫలితాల సరళిని చూస్తే స్పష్టమవుతోంది.
అదేవిధంగా సికింద్రాబాద్ జోన్ పరిధిలోనూ మిశ్రమంగా ఫలితాలు వచ్చినా అత్యధికంగా టీఆర్‌ఎ్‌సకే దక్కాయి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో అన్ని స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. సనత్‌నగర్ నియోజకవర్గంలో మూడు చోట్ల గెలుపొందింది. మల్కాజిగిరి నియోజకవర్గంలోనూ అత్యధిక స్థానాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. హైదరాబాద్ ఈస్ట్, సెంట్రల్ జోన్‌గా ఉన్న ఖైరతాబాద్ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. ముషీరాబాద్ నియోజకవర్గాన్ని ఈసారి క్లీన్‌స్వీప్ చేసింది.
అభ్యర్థులకు ఊహించని షాక్‌లు
గతంలో మాదిరిగా టీఆర్ఎస్ ఊపులో గెలవవచ్చనుకున్న అభ్యర్థులకు ఊహించని షాక్‌లు ఎదురయ్యాయి. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యామ్నాయమంటూ వచ్చిన బీజేపీకి గణనీయంగా పలు ప్రాంతాల్లో సీట్లు పెరిగాయి.