తెగితే.. గుండె చెరువే!
ABN , First Publish Date - 2020-10-21T09:57:49+05:30 IST
వనస్థలిపురంలో కప్పల చెరువు అలుగు పారి.. నీళ్లు హయత్ నగర్‌లోని కుమ్మరికుంట చెరువుకు వచ్చాయి

ప్రమాదకరంగా గొలుసుకట్టు చెరువులు..
మరో భారీ వర్షంతో కట్టలు తెగే ప్రమాదం
ఇప్పటికే మీర్‌పేట చెరువుకు లీకేజీలు
మన్సూరాబాద్, బండ్లగూడ చెరువు కట్టపైకి వరద ప్రవాహం
ప్రమాదంలో బుర్హాన్‌ఖాన్ చెరువు
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): వనస్థలిపురంలో కప్పల చెరువు అలుగు పారి.. నీళ్లు హయత్ నగర్‌లోని కుమ్మరికుంట చెరువుకు వచ్చాయి! ఆ చెరువు నుంచి బాతుల చెరువుకు వరద పోటెత్తింది! వెరసి, వనస్థలిపురం నుంచి హయత్ నగర్ వరకూ ఐదారు కాలనీలు నీట మునిగితే.. 20కిపైగా కాలనీలకు రాకపోకలు బందయ్యాయి. కేవలం అలుగు పారిన ఫలితమిది! వాటిలో ఏ ఒక్క చెరువుకు గండి పడినా పెద్ద సంఖ్యలో కాలనీలు జల దిగ్బంధమే! ఇటువంటి గొలుసుకట్టు చెరువులు పలుచోట్ల ఉన్నాయి. వాటికి గండి పడితే.. వందల కాలనీలు నీట మునుగుతాయి. మూడు రోజులపాటు వర్షాలంటూ అధికారులు హెచ్చరిస్తుండటంతో ఇప్పుడు ఆయా చెరువుల కట్టల దిగువగా ఉన్న కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. అత్యవసరంగా చెరువు కట్టలను పటిష్ఠం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 185 చెరువులతోపాటు శివారు ప్రాంతాల్లో ఉన్న వందలాది చెరువులు నిండుకుండలా ఉన్నాయి.
గ్రేటర్ పరిధిలోని మన్సూరాబాద్, నాగోల్ డివిజన్లలోని పలు కాలనీలను వరద ముంచెత్తడానికి ఇటీవల ఆ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదు కావడం ఒకటైతే, చెరువులు నిండిన తర్వాత మిగులు నీళ్లు బయటకు వెళ్లే వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మరో కారణం. మన్సూరాబాద్, బండ్లగూడ, నాగోల్ చెరువులు గొలుసుకట్ట చెరువులు. ఎల్బీ నగర్, చింతల్‌కుంట, సహారా తదితర ప్రాంతాల నుంచి వచ్చే వర్షపునీరు మన్సూరాబాద్ చెరువులోకి చేరుతుంది. అందులో ఎక్కువైన నీరు బండ్లగూడ చెరువులోకి వస్తుంది. అక్కడి మిగులు నీరు నాగోల్ చెరువులోకి చేరి, మూసీలోకి వెళుతుంది. ప్రస్తుతం మన్సూరాబాద్ చెరువు ప్రమాదకరస్థాయిలో ఉంది. ఏదైనా విపత్తు తలెత్తితే.. 50 కాలనీలకు ప్రమాదం పొంచి ఉంది. దీని ప్రభావం బండ్లగూడ చెరువుపైనా పడనుంది.
బండ్లగూడ చెరువుకు భారీ వరద
బండ్లగూడ చెరువుకు ఎగువన కాలనీలు ఏర్పాటై సుమారు 20 ఏళ్లవుతోంది. ఇప్పటి వరకూ ఏనాడూ అక్కడి ఇళ్ల గడపను నీళ్లు తాకిన పరిస్థితి లేదు. వచ్చిన నీరు వచ్చిన్నట్లుగా చెరువులోకి.. అక్కడి నుంచి మూసీలోకి పోయేది. ఇప్పుడు మన్సూరాబాద్ చెరువుతోపాటు ఎగువ కాలనీల నుంచి భారీగా వరద బండ్లగూడ చెరువుకు చేరుతోంది. దాంతోపాటు హరిణ వనస్థలిలోని ఒక ప్రాంతం, జీఎ్సఐలో కురిసిన వరద పూర్తిగా బండ్లగూడ చెరువులోకే చేరుతోంది. ఇటీవల హరిణ వనస్థలిలోని రెండు కుంటలు పూర్తిగా నిండి బండ్లగూడ రోడ్డులోని ఫారెస్టు పార్కు ప్రధాన గేటు నుంచి వాహనాలు కొట్టుకుపోయే విధంగా వరద ముంచెత్తింది కూడా. బండ్లగూడ చెరువులోకి వచ్చిన నీరు వచ్చినట్లుగా పోయే పరిస్థితి లేదు. ఆ మేరకు తూములు, అలుగులను సిద్ధం చేయలేదు. మల్లాపూర్‌లోని బుర్హాన్‌ఖాన్ చెరువు ప్రమాదంలో ఉంది. ఇటీవలి వరద ఎఫ్టీఎల్ పరిధిలోనూ, వరద నీటి ప్రవాహ వ్యవస్థలో ఉన్న సుమారు 500 ఇళ్లను ముంచెత్తింది. ఇప్పుడు చెరువులో నీరంతా కట్టపైకి వచ్చేవిధంగా చేరింది. బుర్హన్‌ఖాన్ చెరువు కట్ట తెగితే బాలాపూర్ పెద్ద చెరువుపై ప్రమాదం చూపనుంది. పదికిపైగా కాలనీలు నీట మునగనున్నాయి.

మీర్‌పేట పెద్ద చెరువు లీకేజీలు
మీర్పేట్ పెద్ద చెరువుకు లీకేజీలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా మారింది. కట్టకు అక్కడక్కడ లీకేజీలు ఏర్పడ్డాయి. ఏ క్షణాన చెరువు కట్ట తెగుతుందో తెలియక స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇళ్లను ఖాళీ చేశారు. అధికారులు సైతం చెరువు కట్ట పటిష్ఠంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. మీర్పేట్ పెద్ద చెరువుకు ప్రమాదం ముంచుకొస్తే.. దిగువన ఉన్న కాలనీలతోపాటు పలు చెరువులపై భారీగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, మంత్రాల చెరువులోకి వరద ముంచెత్తితే కట్ట తెగేందుకు అవకాశముంటుంది. అక్కడి నుంచి సందెల చెరువు.. సరూర్‌నగర్ చెరువుపై భారీగా ప్రభావం పడనుంది. ఫలితంగా, గొలుసుకట్టు వ్యవస్థలో ఉన్న పలు కాలనీలను వరద నీరు ముంచెత్తే అవకాశాలున్నాయి.
చెరువు కట్టలు పటిష్ఠంగా లేవు
20 ఏళ్ల కిందట నగరాన్ని వరదలు ముంచెత్తిన సందర్భంలో అప్పట్లో సుమారు 85 చెరువు కట్టలను పటిష్ఠం చేశారు. తర్వాత ఆ ఊసే లేదు. మిషన్ కాకతీయ కింద గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల పూడికతీత, కట్టల పటిష్ఠానికి చర్యలు చేపట్టారు. నగరంలో రూ.285 కోట్లతో 40 చెరువు కట్టలను పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. కానీ, జీహెచ్ఎంసీ పరిధిలో పనులు అంతంత మాత్రంగానే చేశారు. ఇప్పటికైనా నగరంలో, శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులను అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా, కట్టలను పటిష్ఠం చేసేందుకు చర్యలు తీసుకోవాలని రిటైర్డ్ ఇంజనీర్ అధికారి ఒకరు సూచించారు.
