తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-11-07T21:48:56+05:30 IST

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కరోనా ముందు జాగ్రత్తలు పాటించి తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తెలిపారు

తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు

అలంపూర్: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కరోనా ముందు జాగ్రత్తలు పాటించి తుంగభద్ర  పుష్కరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం అలంపూర్ లోని హరిత హోటల్ లో  తుంగభద్ర పుష్కరాల ఏర్పాట్లు, నిర్వహణపై ముగ్గురు మంత్రులు సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కొత్తగా ఏర్పడ్డ తెలంగాణలో రాష్ట్రంలో గోదావరి, కృష్ణ పుష్కరాలను  ప్రభుత్వం ఘనంగా నిర్వహించిదని, అయితే ప్రస్తుతం నెలకొని  ఉన్న కోవిడ్ ప్రత్యేక పరిస్థితుల కారణంగా తుంగభద్ర పుష్కరాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నామన్నారు.

 

భక్తులు దీన్ని అర్థం చేసుకోని సహకరించాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పుణ్య స్నానం ఆచరించి, దర్శనం చేసుకోవాలని సూచించారు.కోవిడ్‌ నేపథ్యంలో  భక్తుల సౌకర్యాలపై  ప్రభుత్వ యంత్రాంగం దృష్టి సారించిందని,తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. పుష్కర ఘాట్లతోపాటు జల్లు స్నానం చేసేందుకు షవర్లు, మహిళలకు ప్రత్యేక డ్రెస్ చేంజింగ్ రూంలు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రులు అదేశించారు.. ఘాట్ల సమీపంలో పారిశుధ్యం పనుల నిర్వహణకు అదనపు సిబ్బందిని నియమించాలన్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు స్నాన ఘట్టాల వద్ద శరీర  ఉష్ణోగ్రతలను పరిశీలించేందుకు వైద్యాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.


తుంగభద్ర నది ప్రవాహం ఎక్కువగా ఉన్నందున  అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, పుష్కర్ ఘాట్స్ వద్ద బారికెడ్ లు ఏర్పాటు చేయాలని, బోట్స్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలన్నారు.ఉమ్మడి  మహబూబ్ నగర్ జిల్లా యంత్రాంగం కలిసి కట్టుగా పని చేసి పుష్కరాలను విజయవంతం చేయాలని సూచించారు.గతంలో నిర్మించిన పుష్కర ఘాట్లకు ఎమైనా మరమ్మత్తులు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు.


 రాజోలి, పుల్లూర్, వేణిసొంపురం, అలంపూర్ లో ప్రధాన పుష్కర్ ఘాట్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.నవంబర్ 20 న మధ్యాహ్నం 1:23 గంటలకు అలంపూర్  పుష్కర్ ఘాట్ వద్ద వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య పుష్కరాలను ప్రారంభిస్తారు.నవంబర్‌ 20న ప్రారంభమయ్యే తుంగభద్ర పుష్కరాలు డిసెంబర్‌ 1న ముగుస్తాయి. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు అబ్రహం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, గద్వాల్ జిల్లా కలెక్టర్ శృతి ఓఝా, ఎస్పీ రంజాన్ రతన్ కుమార్,  జిల్లా అధికారులు, ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.


Updated Date - 2020-11-07T21:48:56+05:30 IST