కాగితాల్లో ఉండే ఇళ్లు కళ్లముందుకొచ్చాయ్‌..

ABN , First Publish Date - 2020-09-13T10:03:58+05:30 IST

గత ప్రభుత్వాలు పేదలకు సొంతిళ్లను కేవలం కాగితాల్లోనే చూపించేవని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇళ్లను కట్టించి చూపిస్తోందని..

కాగితాల్లో ఉండే ఇళ్లు కళ్లముందుకొచ్చాయ్‌..

‘డబుల్‌’ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌


పర్వతగిరి, సెప్టెంబరు 12: గత ప్రభుత్వాలు పేదలకు సొంతిళ్లను కేవలం కాగితాల్లోనే చూపించేవని, కానీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇళ్లను కట్టించి చూపిస్తోందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. శనివారం మండలంలోని తురుకలసోమారం గ్రామంలో నిర్మించిన 30 డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్లను మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమే్‌షలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండలకేంద్రంలోని పోలుకమ్మచెరువు, ఊరచెరువు, అవ్వగారి చెరువు, కొత్తచెరువు, బైరోనికుంటలో చేపపిల్లలను వదిలారు. నూతన రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందడంతో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రులు క్షీరాభిషేకం నిర్వహించారు. మండలానికి వచ్చిన మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ను గీతకార్మికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రూరల్‌ కలెక్టర్‌ హరిత, డీఆర్‌డీఏ పీడీ సంపత్‌రావు, ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగులాల్‌, సర్పంచ్‌ రేణుక, నాయకులు  పాల్గొన్నారు. 


ఉన్నోళ్లకే ఇళ్లు ఇచ్చారని గ్రామస్థుల నిరసన 

తురుకల సోమారంలో నిర్మించిన డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్ల కేటాయింపులో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 డబుల్‌ ఇళ్లు నిర్మించగా, దానిలో సుమారు 15 మంది వరకు గతంలోనే ఇళ్లు, భూములున్నాయని ఆరోపించారు. ఇళ్లులేని నిరుపేదలను కాదని కార్లలో తిరిగేవారికి ఇళ్లను ఇచ్చారని ఆరోపించారు. అర్హులకే ఇళ్లను అందించాలని శనివారం ప్లకార్డులతో డబుల్‌బెడ్రూమ్‌ ఇళ్ల ప్రారంభవేదిక వద్దకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు రోడ్డుమీదే నిరసన తెలిపారు. 


వ్యక్తి ఆత్మహత్యాయత్నం

డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని ఓ వ్యక్తి శనివారం మంత్రుల పర్యటనలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కథనం ప్రకారం. సోమారంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూమ్‌ ఇళ్లలో డ్రాలో తన కోడలు బానోత్‌ మంజులకు ప్రధాన రహదారి వెంట ఇళ్లు వచ్చిందని, అయితే తమకు వచ్చిన ఇంటిని కాకుండా అధికారులు వేరే ఇంటిని ఇస్తున్నారని బానోతు ఈర్య అనే వ్యక్తి ఆత్యహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే ఎస్సై ప్రశాంత్‌బాబు ఈర్యను తన వాహనంలో ఎక్కించుకుని చికిత్స కోసం మండలకేంద్రానికి తరలించారు. 

Updated Date - 2020-09-13T10:03:58+05:30 IST