వాళ్లు చేయరు.... మేం చేస్తుంటే ఓర్వరు..

ABN , First Publish Date - 2020-09-13T10:03:16+05:30 IST

‘‘వాళ్లు చేయలేదు.. మేం చేస్తుంటే ఓర్వడం లేదని, తెలంగాణను ఏనాడు పట్టించుకోని పార్టీలు.. నేడు కేసీఆర్‌ ప్రభుత్వం ..

వాళ్లు చేయరు.... మేం చేస్తుంటే ఓర్వరు..

పీవీని ఏనాడు పట్టించుకోని ప్రతిపక్షాలు

రాష్ట్రంలో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు.. 

రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడా, యువజన, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌

మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతితో కలిసి లక్నెపల్లి గ్రామ సందర్శన


నర్సంపేట టౌన్‌, సెప్టెంబరు 12 : ‘‘వాళ్లు చేయలేదు.. మేం చేస్తుంటే ఓర్వడం లేదని, తెలంగాణను ఏనాడు పట్టించుకోని పార్టీలు.. నేడు కేసీఆర్‌ ప్రభుత్వం అభివృద్ధి పనులను చేస్తుంటే అడ్డుకుంటున్నారని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడా, యువజన, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్‌ అన్నారు. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు జన్మస్థలమైన వరంగల్‌ రూరల్‌ జిల్లా లక్నెపల్లి గ్రామాన్ని టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్‌, ఎంపీ మాలోతు కవితలతో కలిసి మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ శనివారం గ్రామాన్ని సందర్శించారు. తొలుత గ్రామంలోని పీవీ స్మారక మందిరం వద్ద పీవీ విగ్రహానికి నివాళులు అర్పించి మందిరంలోని ఫొటో ఆల్బన్‌ను తిలకించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడారు. 


ప్రస్తుత ప్రతిపక్ష పార్టీలు గతంలో పీవీ నర్సింహరావును పట్టించుకులేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులను సైతం అడ్డుకుంటున్నాయన్నారు. ఇటీవల నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తే దాన్ని సైతం అడ్డుకుంటున్నాయన్నారు. లక్నెపెల్లి గ్రామస్థులు రాజకీయాలకతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. తన తండ్రి, పీవీ నర్సింహరావు మంచి సన్నిహితులన్నారు. అసలు పీవీ నర్సింహరావు జన్మస్థలం లక్నెపెల్లి అని తనకు తెలియదని, ఇటీవల సీఎం కేసీఆర్‌ లక్నెపెల్లి అభివృద్ధిపై కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడమంటే అప్పుడే తెలిసిందన్నారు. తన శాఖ పరంగా గ్రామంలో అభివృద్ధి పనులను చేపడతానని చెప్పారు. పీవీ జన్మించిన ఇంటికి సమీపంలో అర ఎకరం స్థలాన్ని ఇచ్చేందుకు ప్రజలు ముందుకు వస్తే బాగుంటుందని పేర్కొన్నారు. 


స్త్రీ, శిశు శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడు తూ.. పీవీ జీవితాన్ని ప్రతీ ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ.. పీవీకి భారతరత్న ఇవ్వాలని పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణ ఎంపీలమంతా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. పీవీ తనయురాలు వాణిదేవి నాలుగేళ్లుగా పీవీ ట్రస్టును ఏర్పాటు చేసి లక్నెపెల్లిని అభివృద్ధి చే యాలని ప్రభుత్వం దృష్టికి తీసువచ్చారన్నారు. లక్నెపెల్లి గ్రామాభివృద్ధికి మంత్రులు సహకరించాలని కో రారు. అసెంబ్లీ సమావేశంలో  మరోసారి చర్చించాలని, గ్రామంలో భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చే యాలని, ఊరచెరువును మినీట్యాంక్‌ బండ్‌గా మార్చాలని కోరారు. పిన్సిపల్‌ సెక్రటరీ శ్రీనివాసరావు, కలెక్టర్‌ హరిత, గ్రామ సర్పంచ్‌ గొడిశాల రాంబాబు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-13T10:03:16+05:30 IST