సంజయ్.. నిరూపించలేకుంటే ముక్కు నేలకు రాస్తావా..?
ABN , First Publish Date - 2020-10-24T08:36:29+05:30 IST
‘‘బీజేపీని ప్రజలు నమ్మరని తెలిసినా ఊళ్లలోకి వెళ్లి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇదే రాజక్కపేటలో ఓ మహిళా కార్పొరేటర్ ప్రజలకు అవాస్తవాలు చెబుతోంది.

పింఛన్లలో కేంద్రం వాటా ఎక్కువగా ఉందా
రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా
బిహార్‌లో వ్యాక్సిన్ ఇస్తామనడం దారుణం
మోదీ ఆ రాష్ట్రానికే ప్రధానా..?: హరీశ్
దుబ్బాక, అక్టోబరు 23 : ‘‘బీజేపీని ప్రజలు నమ్మరని తెలిసినా ఊళ్లలోకి వెళ్లి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇదే రాజక్కపేటలో ఓ మహిళా కార్పొరేటర్ ప్రజలకు అవాస్తవాలు చెబుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పింఛన్లలో తమదే ఎక్కువ వాటా ఉందని అంటున్నరు. ఆయనను అడుగుతున్నా మీరిచ్చిన నిధులెన్ని? పింఛన్లలో మీ వాటా ఎంత? మీరు చెబుతున్నది నిజమని నిరూపిస్తే దుబ్బాక బస్టాండ్ వద్ద రాజీనామా చేస్తా. నిరూపించలేకుంటే ముక్కు నేలకు రాయడానికి సిద్ధమా?’’ అని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బీజేపీ అధ్యక్షుడికి సవాల్ విసిరారు. బీజేపీ అంటేనే భారతీయ ఝూటా పార్టీ అని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పుకార్ల పుట్ట, అబద్ధాల గుట్ట అని మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజక్కపేట, బల్వంతాపూర్‌లో మంత్రి హరీశ్‌రావు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతా రామలింగారెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాము అందిస్తున్న బీడీ కార్మికుల పింఛన్లలో రూ.1600 కేంద్రం ఇచ్చిందని బీజేపీ కార్పొరేటర్ ప్రచారం చేశారని, కేంద్రం నిధులతోనే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తప్పుడు లెక్కలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక బస్టాండ్‌కు వచ్చి లెక్కలు చూపాలని తాను సవాల్ విసిరితే ఇప్పటి వరకు స్వీకరించలేదన్నారు. దుబ్బాకకు రావడానికి మొహం చెల్లడం లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కిట్‌లో రూ.8 వేలు ఇస్తున్నామని ఝూటాబాజీ ప్రచారం చేస్తున్నారని, 8పైసలు కూడా ఇవ్వలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అంటే కాలుతున్న మోటార్లు, కూలిన రైతుల తనువులని అన్నారు. కాంగ్రెస్ హయాంలో పూర్తిగా రైతులు నష్టపోయారని చెప్పారు.
మోదీ బిహార్‌కే ప్రధానా..?
బిహార్ ఎన్నికల దృష్ట్యా మోదీ ప్రభుత్వం ఆ రాష్ట్రానికి కరోనా మందును ఉచితంగా పంపిణీ చేస్తామని చెబుతోందని, మరి దుబ్బాక ప్రజలు ఏం పాపం చేశారని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. బిహార్‌లో గెలిస్తే ఆ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ ఇస్తామని ప్రచారం చేయడం దారుణమన్నారు. మోదీ దేశానికి ప్రధానా? లేక బిహర్‌కేనా? చెప్పాలని డిమాండ్ చేశారు. బిహార్‌లో తమ అభ్యర్థులు గెలిస్తే కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామన్న బీజేపీ మరి తెలంగాణకు ఎలా పంపిణీ చేస్తారో చెప్పాలన్నారు.