బస్తీ దవాఖానాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం- తలసాని
ABN , First Publish Date - 2020-08-12T22:32:20+05:30 IST
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీదవాఖానాల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బస్తీదవాఖానాల ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ప్రజల అవసరాన్నిబట్టి మరిన్నిఆస్ప్రతులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న బస్తీదవాఖానాల్లో విద్యుత్, తాగునీరు, చిన్నచిన్న మరమ్మతులు వంటివి ఉంటే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. జీహెచ్‌ఎంసి పరిదిలోని ప్రజలకు వైద్యం, విద్యా రంగాలతో పాటు గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామని అన్నారు.
వేలాది రూపాయలు ఖర్చుచేసి వైద్య చికిత్స పొందలేకపోతున్నపేద ప్రజల కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వాసుపత్రులు, బస్తీదవాఖానాలలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులను కూడా ఉచితంగానే అందిస్తున్నట్టు తెలిపపారు. ఈ సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని సూచించారు. మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రత్యేక ఆలోచనలతోనే బస్తీదవాఖానాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన వివరించారు. గ్రేటర్ పరిధిలో 300 బస్తీదవాఖానాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.