రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలి:తలసాని

ABN , First Publish Date - 2020-12-07T20:24:43+05:30 IST

రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 8 వ తేదీన నిర్వహించే భారత్ బంద్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.

రైతులకు నష్టం కలిగించే వ్యవసాయ బిల్లును వ్యతిరేకించాలి:తలసాని

హైదరాబాద్: రైతులకు నష్టం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 8 వ తేదీన నిర్వహించే భారత్ బంద్ లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్  పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద  సనత్ నగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ  జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులతో రైతులకు తీరని నష్టం కలుగుతుందని అనేక రాష్ట్రాలకు చెందిన రైతులు ఆందోళనలు చేపట్టారని వివరించారు.


నూతన వ్యవసాయ బిల్లును నిరసిస్తూ 8 వ తేదీన చేపట్టే భారత్ బంద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్  మద్దతు ప్రకటించారని చెప్పారు. ఈ నేపద్యంలో 8 వ తేదీ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు నిర్వహించే బంద్ కు అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. భారత్ బంద్ సందర్బంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 2 వేల వాహనాలతో బైక్ ర్యాలీ ప్రారంభించి మోండా మార్కెట్, మహంకాళి వీధి, జనరల్ బజార్, ప్యారడైజ్, బేగంపేట్, అమీర్ పెట్ ల మీదుగా సనత్ నగర్ వరకు నిర్వహించడం జరుగుతుందని మంత్రి వివరించారు.


జీహెచ్ఎంసి ఎన్నికల ఫలితాల సమీక్ష సందర్బంగా ఆయన మాట్లాడుతూ గెలుపు, ఓటములు సహజమని చెప్పారు.  ఓడినా, గెలిచినా నిరంతరం ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి  చేయడం ద్వారా ప్రజల మనసులను గెలుచుకోవాలని సూచించారు. శుక్రవారం నుండి మీ మీ డివిజన్ లలో పాదయాత్ర లు నిర్వహించడం ద్వారా ప్రజల సమస్యలను తెలుసుకోవాలని  చెప్పారు. తాను కూడా పాదయాత్ర ల లో పాల్గొంటానని మంత్రి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.


ఈ ఎన్నికల లో శ్రమించిన ప్రతి ఒక్కరిని మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, కార్పొరేటర్ లు  కొలన్ లక్ష్మీ, కురుమ హేమలత, మహేశ్వరి, నామన శేషుకుమారి, అత్తిలి అరుణ, ఉప్పల తరుణి, ఆకుల రూప, పార్టీ డివిజన్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T20:24:43+05:30 IST