కార్పొరేటర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి:తలసాని

ABN , First Publish Date - 2020-11-15T22:54:15+05:30 IST

నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ లను ఆదేశించారు.

కార్పొరేటర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలి:తలసాని

హైదరాబాద్: నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పశుసంవర్ధక, మత్స్య  శాఖల మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్పొరేటర్ లను ఆదేశించారు. ఆదివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ది పై కార్పొరేటర్ లు, వివిధ కాలనీలు, బస్తీల అధ్యక్షులతో డివిజన్ ల వారిగా సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 800 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు. నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుండి పరిష్కారానికి నోచుకోని అనేక ప్రజా సమస్యలను తమ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో పరిష్కరించినట్లు చెప్పారు.ఇంకా సమస్యలు ఉంటే వాటిని తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. వరద ముంపుకు గురైన కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్ధిక సహాయం కోసం మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.


బాధిత కుటుంబాలకు ఈ విషయాన్ని తెలియజేయాలని సూచించారు. అదేవిధంగా ఆస్తిపన్ను చెల్లించే వారికి ప్రభుత్వం 50 శాతం రాయితీ కల్పించిందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, కొలన్ లక్ష్మీ, ఆకుల రూప, కుర్మ హేమలత, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-15T22:54:15+05:30 IST