జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందే!

ABN , First Publish Date - 2020-10-13T09:43:42+05:30 IST

చట్టంలో పేర్కొన్న విధంగా జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాల్సిందేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు.

జీఎస్టీ పరిహారం చెల్లించాల్సిందే!

రూ.73 వేల కోట్లు పెద్ద మొత్తమేమీ కాదు

మరోసారి కేంద్రానికి స్పష్టం చేసిన హరీశ్‌


హైదరాబాద్‌, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): చట్టంలో పేర్కొన్న విధంగా జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాల్సిందేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కేంద్రాన్ని కోరారు. ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం 42వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బీఆర్కేభవన్‌ నుంచి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వాదనను మరోసారి ఆయన వినిపించారు. ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ పరిహార చట్టంలోని సెక్షన్‌ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు చెల్లించాలని కోరారు. ఈ పరిహారాన్ని తప్పనిసరిగా పరిహార నిధి నుంచే చెల్లించాలని చెప్పారు. సెస్‌తో పాటు, జీఎస్టీ కౌన్సిల్‌ సిఫారసు చేసే ఇతర మొత్తం నిధులను తప్పనిసరిగా జీఎస్టీ పరిహార నిధిలో జమ చేయాలని కోరారు.


ఆప్షన్‌ 1, ఆప్షన్‌ 2 కింద పేర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు పరిహార నిధి చట్టం సెక్షన్‌ 10(1) చెబుతోందని, దీనిపైన జీఎస్టీ కౌన్సిల్‌ చర్చించవచ్చని సూచించారు. ‘‘ఆప్షన్‌ 1లో చెల్లించాల్సిన పరిహారాన్ని లక్ష పది వేల కోట్లకు, ఆప్షన్‌ 2లో లక్ష 83 వేల కోట్లకు సవరించారు. వీటి మధ్య అంతరం రూ.73 వేల కోట్లు మాత్రమే. ఇదేమీ పెద్ద మొత్తం కాదు. ఆప్షన్‌ 1లో పేర్కొన్న పరిహారంతో పాటు ఈ రూ.73 వేల కోట్లు చెల్లించాలి’’ అని కోరారు. ఈ సమావేశంలో ఛత్తీ్‌సగఢ్‌ మంత్రి చెప్పినట్లు, జీఎస్టీ పరిహారం చెల్లింపుల కోసం తీసుకునే రుణం ఆర్టికల్‌ 293 పరిధిలో ఉండదని గుర్తుచేశారు.


అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు నష్టం: హరీశ్‌

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా ప్రకటించిన ఫార్ములాతో అభివృద్ధి చెందిన రాష్ట్రాలు నష్టపోనున్నాయని హరీశ్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాను 2.43 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గించారని చెప్పారు. ఫైనాన్స్‌ కమిషన్‌ చేసిన ఈ ఫార్ములా ఆధారంగా ప్యాకేజీని ఇవ్వడం వల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు. ఈ ప్యాకేజీకి రాష్ట్రాల జనాభాతో పాటు పెట్టుబడి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి కోరారు.


తద్వారా అభివృద్ది చెందిన రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపును 2.43 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గించడం వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చేందుకు తెలంగాణ రాష్ట్రానికి రూ.723 కోట్లను వన్‌ టైం గ్రాంటుగా ఇవ్వాలని సిఫార్సు చేసినా కూడా కేంద్రం ఆమోదించలేదని గుర్తు చేశారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ.723 కోట్లను వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు కోరారు. కాగా.. జీఎస్టీ కౌన్సిల్‌ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని హరీశ్‌ ఆరోపించారు.

Updated Date - 2020-10-13T09:43:42+05:30 IST