వ్యాధుల బారిన పడిని జీవాలకు వైద్యసేవలు అందించాలి- తలసాని

ABN , First Publish Date - 2020-09-24T22:26:01+05:30 IST

సీజనల్‌ వ్యాధుల బారిన పడిన జీవాలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హెచ్చరించారు.

వ్యాధుల బారిన పడిని జీవాలకు వైద్యసేవలు అందించాలి- తలసాని

హైదరాబాద్‌: సీజనల్‌ వ్యాధుల బారిన పడిన జీవాలకు వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హెచ్చరించారు. రాష్ట్రంలోని ఆయా జిల్లాల పశుసంవర్ధక శాఖ, డెయిరీ అధికారులతో మంత్రి తలసాని గురువారం వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ కోట్లాది రూపాయల వ్యయంతో జీవాలకు అవసరమైన మందులు, వ్యాక్సిన్‌లను కొనుగోలుచేసి సరఫరా చేసిందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందులను ఆసుపత్రుల్లో లభ్యత పై ఉన్నతస్ధాయి అధికారులతో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు చేపడతామని చెప్పారు. జీవాలకు అవసరమైన మందులు అందుబాటులో లేవని, వైద్యులు అందుబాటులో ఉండడం లేదన్న ఫిర్యాదులు రైతుల ఉంచి వస్తున్నాయని అన్నారు. 


జీవాలకు అవసరమైన వ్యాక్సిన్‌లు ఉత్పత్తిచేస్తున్న విబిఆర్‌ఐని మేడ్చల్‌ జిల్లా కరకపట్లకు తరలించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు తమ భూములలో పశుగ్రాసం పెంపకం చేపట్టేలా అధికారులు ప్రోత్సహించాలన్నారు. ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ కింద చేపట్టిన నీటి తొట్టు, గొర్రెలు, క్యాటిల్‌ షెడ్‌ల నిర్మాణం పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పశుసంవర్ధకశాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, డైరెక్టర్‌ లక్ష్మారెడ్డి,  అడిషనల్‌ డైరెక్టర్‌ రాంచందర్‌, డెయిరీ ఎండి శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-09-24T22:26:01+05:30 IST