ప్రతి గ్రామంలో 1000 తాటి, ఈత వనాలను పెంచుతాం- శ్రీనివాస్‌గౌడ్‌

ABN , First Publish Date - 2020-06-25T20:03:30+05:30 IST

ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో 1000 తాటి, ఈత వనాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు.

ప్రతి గ్రామంలో 1000 తాటి, ఈత వనాలను పెంచుతాం- శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌: ఆరో విడత హరితహారంలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో 1000 తాటి, ఈత వనాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఆ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. అబ్కారీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల తాటి, ఈత మొక్కలను ఈ సంవత్సరంలో 4వేల గ్రామాల్లో ప్రతి గ్రామంలో వెయ్యిచొప్పున పెంచుతామని అన్నారు. చెరువులు, కుంటలు, శిఖం భూములు, అన్ని ప్రభుత్వ భూముల్లో వీటిని పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు. కాలువలు, నాలాల ప్రదేశంలో కూడా చెట్లను నాటుతామని అన్నారు. రాబోయే మూడు సంవత్సరాల్లో 12,751 గ్రామ పంచాయితీల్లో తాటి, ఈతచెట్లను పెద్దసంఖ్యలో నాటాలని ప్రణాళికలు రూపొందించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇంకా అక్కడక్కడ గుడుంబా నియంత్రణలో లేదని, ముఖ్యంగా పాత వరంగల్‌ డివిజన్‌లో ఈ విషయం పై గుడుంబా అమ్మకం, తయారీ దారుల పైనా, బెల్లం అమ్మకం దారులపైనా ఉక్కుపాదం మోపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.


రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ పెంచాలని ఇతర రాష్ర్టాల నుంచి అక్రమ మద్యం సీసా రావొద్దని అధికారులను ఆదేశాలు ఇస్తూ ఎక్కడైనా అధికారి అలసత్వం వహించినట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టబోతున్న నీరా పాలసీలో భాగంగా మొదటి విడతగా 5కోట్లను మంజూరు చేసినట్టు తెలిపారు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో నీరా కేంద్ర ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు. అదే విధంగా నీరా సేకరణ, ఉత్పత్తి, మార్కెటింగ్‌, టెట్రాప్యాకింగ్‌ల రూపకల్పనలపై కూడా ఉన్నతాధికారులతో మంత్రి చ ర్చించారు. 

Updated Date - 2020-06-25T20:03:30+05:30 IST