ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పండగల పై నిర్లక్ష్యం
ABN , First Publish Date - 2020-10-24T20:13:51+05:30 IST
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ పండగలను,సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేశారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు తెలంగాణ పండగలను,సంస్కృతి, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేశారని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతనే వాటికి ప్రభుత్వం చేయూతనిస్తోందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ పండగలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. శనివారం రవీంద్ర భారతిలో సద్దుల బతుకమ్మ సంబరాల్లోభాగంగా మంత్రి ముఖ్యఅతిధిగా హాజరై గౌరీపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలను కరోనా నేపధ్యంలో ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ తమ తమ ఇండ్లలోనే సంప్రాదయ పద్దతిలో నిర్వహించుకోవాలని శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నేతృత్వంలో స్వయం సమృద్ది సాధించి దేశానికే అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందన్నారు. బతుకమ్మ పండగను రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవడంతో పాటు మహిళలను గౌరవించడానికి బతుకమ్మ చీరలను కానుకగా అందిస్తున్నామని చెప్పారు. బతుకమ్మ పండగను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించి బతుకమ్మ పండగకు ఖ్యాతిని తీసుకు వచ్చేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస్‌రాజు, సాంస్కృతికశాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.