గణేష్ పండగను ఇంట్లోనే జరుపుకోవాలి- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ABN , First Publish Date - 2020-08-21T00:14:41+05:30 IST
కరోనా నేపధ్యంలో నెలకొన్న పరిస్ధితులకనుగుణంగా రంజాన్, గుడ్ ఫ్రైడేలాంటి పండుగల మాదిరిగానే గణేష్ పండగను కూడా ఇంట్లోనే జరుపుకునే విధంగా ఏర్పాట్లుచేసుకోవాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.

హైదరాబాద్: కరోనా నేపధ్యంలో నెలకొన్న పరిస్ధితులకనుగుణంగా రంజాన్, గుడ్ ఫ్రైడేలాంటి పండుగల మాదిరిగానే గణేష్ పండగను కూడా ఇంట్లోనే జరుపుకునే విధంగా ఏర్పాట్లుచేసుకోవాలని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం పాటిస్తూ పండగను జరుపుకోవాలన్నారు. గురువారం ఎల్‌బి స్టేడియంలో ఎంపీ సంతోష్‌కుమార్ నిర్వహించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సౌజన్యంతో సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఏకో ఫ్రెండ్లీ 1.001 సీడ్‌గణేష్ మట్టి విగ్రహాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గల్లీ గల్లీలో గణేష్ విగ్రహాలను ప్రతిష్టించి అన్ని వయసుల వారు భక్తి శ్రద్ధలతో గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఈసంవత్సరం ఉత్సవాలను ఇంట్లోనే జరుపుకోవాలని అన్నారు.
రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటించి హరిత తెలంగాణకు తోడ్పడడం అభినందనీయమన్నారు. కరోనా సమయంలో గుంపులుగుంపులుగా చేరకుండా భౌతిక దూరం పాటిస్తూ ఎవరికివారు జాగ్రత్త పడితే అదే పది మందికి ప్రాణదానం చేసినట్టని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్‌రాజు,షూటర్ ఈసా సింగ్, బాక్సర్ నిఖత్‌జరీన్, కార్పొరేటర్లు మంతా సంతోష్‌గుప్తా, పరమేశ్వరి సింగ్ తదితరులు పాల్గొన్నారు.