సమర్ధవంతమైన పోలీసింగ్ తో సాధ్యమైన నేర రహిత తెలంగాణ - హోమ్ మంత్రి

ABN , First Publish Date - 2020-10-21T21:46:23+05:30 IST

ఆధునిక శాస్త్ర, సాంకేతిక విధానాలను పోలీసింగ్ తో అనుసందానం చేయడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర కార్యక్రమాల ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఏవిధమైన హింసాత్మక సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు.

సమర్ధవంతమైన పోలీసింగ్ తో సాధ్యమైన నేర రహిత తెలంగాణ - హోమ్ మంత్రి

హైదరాబాద్: ఆధునిక శాస్త్ర, సాంకేతిక విధానాలను పోలీసింగ్ తో అనుసందానం చేయడం, ఫ్రెండ్లీ పోలీసింగ్ తదితర కార్యక్రమాల ద్వారా తెలంగాణా రాష్ట్రంలో ఏవిధమైన హింసాత్మక సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర హోమ్ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ పేర్కొన్నారు.  నగరంలోని ఎల్బీ ఇండోర్ స్టేడియం లో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ సభ కు హోమ్ మంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి ఇతర సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు అమరుల కుటుంబ సభ్యులు, రిటైర్డ్ పోలీసు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఇండోర్ స్టేడియం లో ఏర్పాటు చేసిన పోలీసు అమరవీరుల స్మారక చిహ్నానికి హోమ్ మంత్రి  డీజీపీ పుష్ప గుచ్చాలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. 


ఈ సందర్భంగా మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ, దేశం లోని అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేట్ చాలా తక్కువగా ఉందని, హైదరాబాద్ లో గత ఆరు సంవత్సరాలుగా ఏ విధమైన మత ఘర్షణలు జరుగలేదనీ పేర్కొన్నారు. దీనికి కారణం, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు చేసిన నిరంతర కృషి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమేనని అన్నారు. హైదరాబాద్ లో మూడున్నర లక్షలకు పైగా సి.సి. కెమెరాలు ఏర్పాటు చేశామని, ఇది దేశంలో మొదటిది కాగా ప్రపంచంలోనే అత్యధిక సి,సి కెమెరాలు ఏర్పాటు చేసిన నగరంగా హైదరాబాద్ 20 వ స్తానంలో నిలిచించాడని వెల్లడించారు.


రాష్ట్రంలో మహిళలు పిల్ల భద్రతకు అంత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో షీ-టీమ్, ఎన్ఆర్ఐ సెల్, భరోసా కేంద్రాలు, ఆపరేషన్ స్మైల్, ముస్కాన్, సైబ్-హర్ తదితర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో గత ఆరేళ్లుగా అన్నిమతాలకు చెందిన పండగలు, ఉత్సవాలను  ప్రజలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారని,  దీనికి కారణం ప్రజల సహకారం, పోలీసుల కృషే అని హోమ్ మంత్రి అన్నారు. 

 

రాష్ట్రంలో  'ఒకే రాష్ట్రం - ఒకే రకమైన సేవ' - డీజీపీ మహేందర్ రెడ్డి

భాద్యతాయుత, జవాబుదారీ తనం, పారదర్శకత కలిగిన స్నేహ పూర్వక పౌర పోలీసు సేవలను అందించడంలో భాగంగా 'ఒకేరాష్ట్రం- ఒకే రకమైన సేవ'' విధానాన్నిఅందించనున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. దేశ అంతర్గత భద్రత కు సవాలుగా మారిన ఉగ్రవాదం, తీవ్రవాదం, వ్యవస్తీకృత నేరస్తులను ఎదుర్కోవడంలో  పోలీసులు నిరంతర కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో చేపడుతున్న సమర్ధవంతమైన పోలీసింగ్ తో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని గణాంకాలతో సహా వివరించారు. సి.ఎం. కేసీఆర్ దార్శనికతకు, లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ పోలీసు విభాగం కూడా పౌరులే కేంద్రీకృతంగా పలు పధకాలు చేపట్టిందని అన్నారు.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన ప్రత్యేక నిధులతో మెగాసిటీ పోలీసింగ్, ఆధునిక ఆయుదాలు ఇతర పరికరాల కొనుగోలు, పోలీసు స్టేషన్ల ఆధునీకరణ, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం, ఫోరెన్సిక్ ల్యాబ్ ల ఆధునీకరణ, మహిళా భద్రతా, కమ్యూనిటీ పోలీసింగ్ తదితర ఎన్నో చర్యలను చేపట్టామని వివరించారు.శాంతి, భద్రతల పరిరక్షణ కేవలం పోలీసుల తోనే సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ను అమలు చేస్తున్నామని, ప్రజల భాగస్వామ్యంతో సీసీ టీ.వి ఏర్పాటులో హైదరాబాద్ నగరం దేశం లోనే అగ్ర స్తానంలో ఉందని డిజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు.


రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయనీ అయితే,  కోవిడ్ నేపథ్యంలో పెరిగిన సైబర్ ఆధారిత నేరాల అదుపు కు ప్రత్యేక చర్యలు చేపట్టామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. కరోనా, భారీ వర్షాలు తదితర విపత్తుల సమయం లోనూ పోలీసులు విశేష సేవలందిస్తున్నారని దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా లభించాయని అన్నారు. నేటి నుండి 31వ తేదీ వరకు పోలీస్ ఫ్లాగ్ డే గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలను  నిర్వహిస్తున్నట్లు తెలిపారు.   


ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా మరణించిన 264 మంది పోలీసు అమరుల వివరాలతో కూడిన "అమరులు వారు" అనే పుస్తకాన్ని హోమ్ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. అమరులైన 264 మంది పోలీసుల పేర్లను సమావేశంలో నగర అడిషనల్ సీ.పీ. అనీల్ కుమార్ చదివి వినిపించారు. ఈ సందర్బంగా పోలీసు ఫ్లాగ్ డే  సంక్షేమ నిధి విరాళాల సేకరణను హోమ్ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.

 

Updated Date - 2020-10-21T21:46:23+05:30 IST