రూ.1350 కోట్ల పెట్టుబడితో పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రం

ABN , First Publish Date - 2020-08-18T06:56:52+05:30 IST

రాష్ట్రానికి త్వరలో అడ్వాన్స్‌డ్‌ పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రం రానుంది. ఎస్టర్‌ ఫిల్మ్‌టెక్

రూ.1350 కోట్ల పెట్టుబడితో పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రం

  • తొలి దశలో 2022నాటికి 500 కోట్ల ఖర్చు
  • 800 మంది స్థానికులకు ఉద్యోగాలు
  • ఎస్టర్‌ చైర్మన్‌తో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌


 

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి త్వరలో అడ్వాన్స్‌డ్‌ పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తి కేంద్రం రానుంది. ఎస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.1350 కోట్లతో ప్యాకే జింగ్‌ ఫిల్మ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సదరు కంపెనీ సోమవారం తన సమ్మతిని తెలిపింది. ఎస్టర్‌ ఫిల్మ్‌టెక్‌ చైర్మన్‌ అరవింద్‌ సింఘానియాతో మంత్రి కేటీఆర్‌ సోమవారం వర్చువల్‌ మీటింగ్‌ ద్వారా మాట్లాడారు. రాష్ర్టానికి ఎస్టర్‌ కంపెనీ రాకపై మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. తొలిదశ నిర్మాణం కోసం కంపెనీ రూ.500 కోట్లను ఖర్చు చేయనుంది. 2022 మూడో త్రైమాసికానికి తొలి దశ నిర్మాణం పూర్తి కానుంది. తద్వారా, 800 మంది స్థానికులకు ఉద్యోగావకాశాలుంటాయి. ప్యాకేజింగ్‌ పరిశ్రమకు చెందిన పాలిమర్‌ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు. 30 నుంచి 40 శాతం వరకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. కంపెనీ ఏర్పాటుతో ప్యాకేజింగ్‌ పరిశ్రమలో తెలంగాణకు ప్రత్యేక స్థానం దక్కనుందని ఎస్టర్‌ ప్రకటించింది. రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల విధానాల వల్లనే తాము పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించామని సింఘానియా తెలిపారు. పాలిస్టర్‌ ఫిల్మ్‌ ఉత్పత్తుల్లో ఇండియాలోనే ఎస్టర్‌ పరిశ్రమ అగ్రస్థానంలో ఉందన్నారు. తమ పాలిమర్‌ ఉత్పత్తులను 56 దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొన్నారు.


ఆదా ట్రిప్‌ యాప్‌ ఆవిష్కరణ

ఇంధనం, డబ్బు, సమయం వృథాను అరికడుతూ.. సరుకు రవాణా రంగం ప్రణాళికాబద్ధంగా, ప్రతి వాహనం పూర్తి సామర్థ్యంతో నడి చేందుకు దోహదపడే ఆదా ట్రిప్‌ యాప్‌ను మంత్రి కేటీఆర్‌ సోమవారం ఆవిష్కరించారు. సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకురావడానికి సర్వేజనా ఐటీ సొల్యూషన్స్‌ దీనిని రూపొందించింది.

Updated Date - 2020-08-18T06:56:52+05:30 IST