ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రోత్సహించాలి: కేటీఆర్

ABN , First Publish Date - 2020-11-13T21:30:04+05:30 IST

ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉంటూ, నిరంతరం ప్రజల మద్యనే ఉండే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రోత్సహించాలని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు కోరారు.

ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రోత్సహించాలి: కేటీఆర్

హైదరాబాద్: ప్రజల కష్ట సుఖాలలో అండగా ఉంటూ, నిరంతరం ప్రజల మద్యనే ఉండే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించి ప్రోత్సహించాలని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కె. తారక రామారావు కోరారు. శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గంలో ఆయన మంత్రి  తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి 20 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా బల్కంపేట లో 3.60 కోట్ల తో నిర్మించిన వైకుంఠ ధామం ను ప్రారంభించారు. తదనంతరం సనత్ నగర్ డివిజన్ లోని నెహ్రూ నగర్ లో 2.50 కోట్లతో నూతనంగా నిర్మించనున్న తీం పార్క్ కు శంకుస్థాపన చేశారు.


అక్కడి నుండి లేబర్ వెల్ఫేర్ సెంటర్ లో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.అనంతరం మోండా మార్కెట్ డివిజన్ లోని గ్యాస్ మండీలో 2.40 కోట్ల తో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, ఆదయ్య నగర్ లో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన లైబ్రరీ భవనాన్ని, మారేడ్ పల్లి లో 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్ ను కేటీఆర్ ప్రారంభించారు. మారేడ్ పల్లి లో  ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ప్రజల మేలుకోసం అనేక సంస్కరణలు, నూతన చట్టాలను తీసుకొస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి ఆశీర్వదించి ప్రోత్సహించాలని అన్నారు.


కరోనా, భారీ వర్షాల వంటి కష్ట సమయాలలో సైతం తాము ప్రజల మద్యనే ఉన్నామన్న విషయం  గుర్తుచేశారు. ఎలాంటి పరిస్థితులు ఏర్పడినా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగోద్దనేది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సంకల్పం అన్నారు. నగరంలో జీవన ప్రమాణాలను పెంచే దిశగా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గతంలో గల్లీకో క్లబ్, గుడుంబా కంప్ ఉండేవని, అవన్నీ ప్రభుత్వం మూసివేసిందని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన అతి స్వల్ప సమయంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి తో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు.


లక్షాది రూపాయలు వెచ్చించి ఫంక్షన్ హాల్స్ కు వెళ్ళలేని పేదలను దృష్టిలో ఉంచుకొని మల్టి ఫర్పస్ ఫంక్షన్ హాల్స్ ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మున్సిపల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు అమలు అవుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 800 కోట్ల రూపాయల విలువైన  పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఇదే ప్రాంతం నుండి ముఖ్యమంత్రి గా ప్రాతినిద్యం వహించిన మర్రి చెన్నారెడ్డి హయంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కేవలం శిలాఫలకానికే పరిమితం అయిందన్నారు.


ఈ ప్రాంత ప్రజల రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని సనత్ నగర్ పారిశ్రామిక వాడ లో అండర్ పాస్ నిర్మాణానికి, ఫతేనగర్ ఫ్లై ఓవర్ విస్తరణ కోసం అడిగిన వెంటనే 104 కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కు   మంత్రి శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షాలతో నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 10 వేల రూపాయలు చొప్పున ఆర్ధిక సహాయాన్ని అందించిందని, ఇంకా రాని వారికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.


ఈ కార్యక్రమంలో  మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్. కంటోన్మెంట్ ఎంఎల్ఏ సాయన్న, జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, గ్రందాలయ సంస్థ రాష్ట్ర చైర్మన్ ఆయాచితం శ్రీధర్, జోనల్ కమిషనర్ లు ప్రావిణ్య, శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు కొలన్ లక్ష్మి, నామన శేషుకుమారి, ఆకుల రూప, అత్తిలి అరుణ గౌడ్, ఉప్పల తరుణి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-13T21:30:04+05:30 IST