వచ్చే ఐదేళ్లలో మెజార్టీ జనాభా పట్టణల్లోనే- మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2020-06-18T23:47:57+05:30 IST
తెలంగాణలో రానున్నఐదేళ్లలో మెజార్టీ జనాభా పట్టణల్లోనే ఉండే అవకాశం ఉందని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో రానున్నఐదేళ్లలో మెజార్టీ జనాభా పట్టణల్లోనే ఉండే అవకాశం ఉందని మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. భారీఎత్తున జనాబా పట్టణాలలో కేంద్రీకృతమైన నేపద్యంలో వాటిని ప్రణాళికాబద్దమైన అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పౌరసేవలే కేంద్రంగా నూతన పురపాలక చట్టాన్ని తెలంగాణ తీసుకు వచ్చిందన్నారు. ఈ చట్టంలోని విధులు అధికారాలు ఖచ్చితంగా పాటించేలా అధికారులు పనిచేయాలని అన్నారు. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట జిల్లా పరిధిలోని మున్సిపాలిటీల గురువారం నగరంలోని ఎంసిహెచ్‌ఆర్‌డిలో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.
ఈసమావేశానికి మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కొత్త జిల్లాలుగా మారిన నారాయణపేట, గద్వాల్ జిల్లా కేంద్రాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మూడు జిల్లాల పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో రోడ్లు, గ్రీనరీ, స్మశాన వాటికల వంటి ప్రాధమిక అంశాలపై పూర్తి శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుత వర్షాకాలం నేపధ్యంలో సీజనల్‌వ్యాధులు ప్రబలకుండా అరికట్టేందుకు పారిశుద్ధ్యం పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్లు, ఛైర్మన్లను ఆదేశించారు.
ప్రస్తుతం కొత్త మున్సిపాలిటీలలో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్ అవకాశాన్ని వినియోగించుకునేలా ప్రత్యేక ఎల్‌ఆర్‌ఎస్ మేళాలు నిర్వహించాలన్నారు. ఈసారి ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం కేవలం నూతన మున్సిపాలిటీలు, మున్సిపాలిటీలలో విలీనమైన గ్రామాలకు మాత్రమే అని గతంలో మున్సిపల్‌శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం పై విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. సెప్టెంబరు వరకు ఎల్‌ఆర్‌ఎస్ గడువు కొనసాగించాలని, 43 నూతన మున్సిపాలిటీల్లోఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఉందని చెప్పారు.