హాస్టళ్లు మూసివేస్తుండటంపై కేటీఆర్ కీలక ప్రకటన
ABN , First Publish Date - 2020-03-26T01:28:30+05:30 IST
కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టల్ మరియు పేయింగ్ గెస్ట్‌హౌస్

హైదరాబాద్: కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌లో హాస్టల్ మరియు పేయింగ్ గెస్ట్‌హౌస్ నిర్వాహకులు అందులో్ ఉంటున్న విద్యార్ధులు, ఉద్యోగులను ఉన్నపళంగా ఖాళీ చేయించడంపై తీవ్ర దుమారం రేగింది. దీంతో ఉద్యోగులు, విద్యార్ధులు రోడ్డున పడాల్సిన పరిస్థితి నెలకొంది. హాస్టళ్లు ఖాళీ చేయించడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు రవాణా సదుపాయాలు లేక కొందరు, ఎన్‌ఓసీల కోసం పీఎస్‌ల ముందు క్యూ కట్టి మరికొందరు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తమ ఇబ్బందులపై స్పందించాలని విద్యార్థులు, ఉద్యోగులు మొరపెట్టుకున్నారు.
ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. హాస్టల్, పేయింగ్ గెస్ట్‌హౌస్ నిర్వహకులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఏ ఒక్కరనీ కూడా హాస్టళ్ల నుంచి ఖాళీ చేయించవద్దని, అనవసరంగా భయాందోళనను సృష్టించవద్దని నిర్వాహకులకు సూచించారు.
ఇప్పటికే ఈ విషయంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, మేయర్ బొంతు రామ్‌మోహన్, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లతో చర్చించానని, ఈ సమస్యలను పరిష్కరించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌లోని ప్రజాప్రతినిధులు, మేయర్, డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్లు తమ ప్రాంతంలో ఉన్న హాస్టళ్లకు సంబంధిత అధికారులతో వెళ్లి ఈ సమాచారాన్ని విద్యార్థులకు, నిర్వాహకులకు చేరవేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.