ఆ దంపతులకు కేటీఆర్‌ ఆపన్న హస్తం

ABN , First Publish Date - 2020-04-26T09:00:00+05:30 IST

అసలే పేద కుటుంబం..పైగా బిడ్డకు అనారోగ్యం.. ఆ చిన్నారికి..

ఆ దంపతులకు కేటీఆర్‌ ఆపన్న హస్తం

మంత్రి చొరవతో నిత్యావసర సరుకులు అందజేసిన అధికారులు

నేరేడ్‌మెట్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): అసలే పేద కుటుంబం..పైగా బిడ్డకు అనారోగ్యం.. ఆ చిన్నారికి ప్రతిరోజూ మందులు వాడాల్సిందే! లాక్‌డౌన్‌తో ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉన్న తమను ఆదుకోవాలంటూ ఆ దంపతులు అడిగిన సాయానికి మంత్రి కేటీఆర్‌ స్పందించారు. వివరాల్లోకెళితే.. మల్కాజిగిరి మండలం వినాయక్‌నగర్‌లో నివాసముండే దంపతులకు ముగ్గురు పిల్లలు. పెద్ద కుమారుడు ప్రణీత్‌ (8) ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి బ్రెయిన్‌, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో అంగవైకల్యం వచ్చింది. చికిత్స చేసిన వైద్యులు ఆ బాబుకు జీవితాంతం మందులను వాడాలని చెప్పారు. 


అయితే కూలీ పనులకెళ్తేగానీ పూట గడవని పరిస్థితిలోనున్న తమకు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకుండా పోయిందనీ.. కుమారుడికి మందులు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నామంటూ ఆ దంపతులు గతవారం మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌ ద్వారా విన్నవించుకున్నారు. ఇందుకు స్పందించిన కేటీఆర్‌.. వీళ్లకు సాయం అందించాలంటూ మేడ్చల్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. మల్కాజిగిరి తహసీల్దార్‌ బానోత్‌ గీత.. శనివారం ఆ కుటుంబానికి బియ్యం, ఇతర నిత్యావసరాలు అందజేశారు. బాలుడికి రెండు నెలలకు సరిపడా మందులను దాత గోపు రమణారెడ్డి అందించారు.

Updated Date - 2020-04-26T09:00:00+05:30 IST