2 శాతం మరణాలపై రాద్ధాంతమా?

ABN , First Publish Date - 2020-07-14T07:42:21+05:30 IST

రాష్ట్రంలోని కరోనా కేసుల్లో 98 శాతం రికవరీ ఉంది. 2 శాతం మాత్రమే మరణాలు

2 శాతం మరణాలపై రాద్ధాంతమా?

  • 98 శాతం రికవరీలను విస్మరిస్తారా..?
  • ప్రతిపక్షాల తిట్లే మాకు దీవెనలు: కేటీఆర్‌
  • పాలమూరులో వెయ్యి పడకల ఆస్పత్రి: ఈటల
  • మెడికల్‌ కాలేజీ, ఎకో పార్క్‌, ఇళ్ల ప్రారంభం


మహబూబ్‌నగర్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘రాష్ట్రంలోని కరోనా కేసుల్లో 98 శాతం రికవరీ ఉంది. 2 శాతం మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయి. 98 శాతాన్ని వదిలి రెండు శాతంపైనే స్పందించడం సరికాదు. ప్రతిపక్షాలు, మీడియా సానుకూల కోణంలో చూడాలి. కొవిడ్‌ రోగులను ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేర్చుకోకపోతే, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చుకుని వైద్యం అందిస్తున్నాం. ఈ విషయాన్ని గమనించాలి. కరోనాను ఎదుర్కొనడంలో ప్రభుత్వం శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా ప్రతిపక్షాలు అనవసర మాటలతో నోరు పారేసుకుంటున్నాయి. మరో మూడున్నరేళ్లు ఎన్నికలే లేవు. ఇప్పటినుంచే రాజకీయాలెందుకు? ఐనావారి తిట్లే దీవెనలుగా భావించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చే స్తున్నాం’ అని ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో రూ.450 కోట్లతో నిర్మించిన మెడికల్‌ కాలేజీ భవన సముదాయం, 660 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీ, స్ట్రీట్‌ వెండర్స్‌ జోన్లు, 2,087 ఎకరాల్లో కేసీఆర్‌ అర్బన్‌ పార్క్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్‌, శ్రీనివా్‌సగౌడ్‌లతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గాంధీ, ఉస్మానియా తర్వాత అత్యున్నత ప్రమాణాలతో మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీ నడుస్తోందన్నారు. ఇక్కడ వంద పడకల కొవిడ్‌ ఆస్పత్రి కూడా అందుబాటులో ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 2,087 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కేసీఆర్‌ అర్బన్‌ ఎకో పార్కు దేశంలో అతిపెద్దదిగా వివరించారు. ‘కరోనా సంక్షోభంలోనూ ప్రజలకు ఉపయోగపడే ఏ పథకం ఆగకుండా సీఎం చర్యలు తీసుకున్నారు. రైతు బంధు మొదలు వందలాది పథకాలు అమలు చేస్తుండటాన్ని ఓర్వలేకప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి’ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.


పాలమూరులో వెయ్యి పడకల ఆస్పత్రి

మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా త్వరలో వెయ్యి పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ఈటల చెప్పారు. ప్రైవేట్‌కు దీటుగా అన్ని సదుపాయాలు కల్పించామని, సేవలను పెంచుతామని మంత్రి వెల్లడించారు. మంగళవారం నుంచి మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో కొవిడ్‌ పరీక్షలు కూడా కొనసాగుతాయన్నారు. దేశంలో కేరళ, తమిళనాడు తర్వాత వైద్య సేవల్లో తెలంగాణనే ముందుందని, దీన్ని మరింత విస్తృతపరుస్తామన్నారు. మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ మాట్లాడుతూ గతంలో వైద్యం కోసం పాలమూరు వాసులు హైదరాబాద్‌ వెళ్లేవారని.. తెలంగాణ వచ్చాక కేసీఆర్‌ నాయకత్వంలో కార్పొరేట్‌కు దీటుగా మెడికల్‌ కాలేజీ సాధించుకున్నామని అన్నారు. కేసీఆర్‌ తర్వాత కేటీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రాని ముందుకు తీసుకెళ్లే సైన్యం టీఆర్‌ఎ్‌సకు ఉండటాన్ని చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు. పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడటమే తప్ప ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో చూసి అభినందించే ఓపిక  వాటికి లేకుండా పోయిందని అన్నారు. ఎంపీ మన్నె శ్రీనివా్‌సరెడ్డి, శాసన మండలి చీఫ్‌ విప్‌ కె.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-07-14T07:42:21+05:30 IST