నూతన వ్యవసాయ చట్టాలపై పోరాటం: మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2020-12-06T22:52:45+05:30 IST
రైతు ఉద్యమానికి సంఘీభావంగా 8న జరిగే భారత్ బంద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్: రైతు ఉద్యమానికి సంఘీభావంగా 8న జరిగే భారత్ బంద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొనాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దల దిమ్మతిరిగేలా భారత్ బంద్‌ను విజయవంతం చేయాలన్నారు. ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో రైతులు నిరసన తెలుపుతున్నారని వారికి మద్దతుగా నిరసనలు తెలపాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నల్ల చట్టాలను రైతు బిడ్డగా కేసీఆర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అభ్యుదయ రైతుగా కేసీఆర్ భారత్ బంద్‌కు మద్దతిచ్చారని ఈ బంద్‌లో కేంద్రం వైఖరీని ఎండగడుతామని అన్నారు.
రైతులకు తీవ్ర నష్టం
నూతన వ్యవసాయ చట్టాలను టీఆర్‌ఎస్ పార్లమెంట్‌లోనే వ్యతిరేకించిందని.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఓటు వేశామని చెప్పారు. కేకే డివిజన్ కోరినా చట్టాలను ప్రజలపై అకారణంగా రుద్దారని మండిపడ్డారు. భారత్ బంద్‌లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు రోడ్లపై కూర్చోని నిరసన వ్యక్తం చేయాలని తెలిపారు. కేంద్రం తెచ్చిన మూడు చట్టాలతో రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉందని.. నూతన చట్టాలను వెంటనే రద్దు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నల్ల చట్టాలు ఉపసంహరించుకునే వరకు రైతులకు అండగా ఉంటామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేంద్రం తెచ్చిన చట్టాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఆక్షేపించారు. రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వ నూతన చట్టాలు రైతులను తీవ్ర నష్టపరుస్తాయని దుయ్యబట్టారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవసాయ చట్టాలను దేశంపై రుద్దుతోందని మండిపడ్డారు. వ్యాపార, వాణిజ్యవర్గాలు, ట్రాన్స్‌పోర్ట్ నిర్వాహకులు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ప్రతి వ్యాపారవేత్త రెండు గంటల పాటు బంద్ పాటించాలన్నారు. 8న జరిగే భారత్ బంద్ తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా గల్లీ గల్లీ బంద్ కావాలని కోరారు.