విద్యుత్తు వాహనాల హబ్‌గా తెలంగాణ
ABN , First Publish Date - 2020-10-31T09:50:37+05:30 IST
తెలంగాణను విద్యుత్తు వాహనాల తయారీ హబ్‌గా మార్చబోతున్నట్లు మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి,

చందన్‌వెల్లి, దివిటీపల్లిలో తయారీ యూనిట్లు
త్వరలో కొత్త మొబిలిటీ క్లస్టర్ ప్రకటన: కేటీఆర్
‘విద్యుత్తు వాహనాలు - ఇంధన నిల్వల పాలసీ’ ఆవిష్కరణ
5 విద్యుత్తు వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందం.. రూ.3,200 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను విద్యుత్తు వాహనాల తయారీ హబ్‌గా మార్చబోతున్నట్లు మంత్రి కె.తారక రామారావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి, మహబుబ్‌నగర్‌లోని దివిటీపల్లి క్లస్టర్లలో వందల ఎకరాల్లో విద్యుత్తు వాహనాల తయారీ యూనిట్లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విద్యుత్తు వాహనాల తయారీ సంస్థల కోసం వారం రోజుల్లో మొబిలిటీ క్లస్టర్‌ను ప్రకటిస్తామన్నారు. శుక్రవారం ఆయన ‘విద్యుత్తు వాహనాలు - ఇంధన నిల్వల పాలసీ - 2020-30’ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌లతో కలిసి హైదరాబాద్‌లోని ఎంసీఆర్-హెచ్‌ఆర్డీలో ఆవిష్కరించారు. రాష్ట్రంలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్తు వాహనాల తయారీని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే సమగ్రమైన పాలసీని రూపొందించామని చెప్పా రు. ప్రస్తుత పాలసీలో దాదాపు రెండున్నర లక్షల విద్యు త్తు వాహనాలకు రాయితీలు ప్రకటించామని, కేబినేట్‌లో చర్చించి వాటి సంఖ్యను మరింత పెంచుతామన్నారు.
వెయ్యి ఎకరాల్లో ఆటోమొబైల్ క్లస్టర్!
దాదాపు వెయ్యి ఎకరాల్లో ఆటోమొబైల్ తయారీ క్లస్టర్‌ను ప్రోత్సహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌ను ఆటోమొబైల్ క్లస్టర్‌గా ప్రమోట్ చేసి.. తయారీ సంస్థలకు ప్రోత్సహకాలు అందిస్తామన్నారు. హైదరాబాద్ శివారులోని రావిర్యాల, మహేశ్వరంలో ఎలక్రా్ట్రనిక్ క్లస్టర్‌ను పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. చందన్‌వెల్లిలో ఒలెకా్ట్ర, మైత్రా ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీలు యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు. త్వరలో 178 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణకు 28 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని వెల్లడించారు. ఐటీ సాప్ట్‌వేర్ ఎగుమతుల్లో దేశంలోనే రెండో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5,401 విద్యుత్తు వాహనాలు రిజిస్టర్ అయ్యాయని, అందులో 4,292 ద్విచక్రవాహనాలు, 491 మోటార్ క్యాబ్స్, 194 ఈ-రిక్షా, 40 ఆర్టీసీ బస్సులున్నాయని మంత్రి అజయ్‌కుమార్ తెలిపారు. టీఎస్ రెడ్‌కో, హైదరాబాద్ మెట్రో రైల్, పవర్‌గ్రిడ్, పెట్రోలియం కంపెనీలతో ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ చెప్పారు. మహీంద్ర అండ్ మహీంద్ర చైర్మన్ ఆనంద్ మహీంద్ర, సీఈవో పవన్ గోయెంకా, నీతి ఆయోగ్ సలహాదారు అన్నారా య్, యెస్ బ్యాంక్ చైర్మన్ సునీల్ మోహతలు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సమావేశంలో రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
14,650 మందికి ఉపాధి!
ఈ సమావేశంలో ఐదు విద్యుత్తు వాహనాల తయారీ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంస్థలు తెలంగాణలో రూ.3,200 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటి ద్వారా 14,650 మందికి ఉపాధి కలగనుంది. అందులో ప్రముఖ విద్యుత్తు బస్సుల తయారీ సంస్థ మైత్రా ఎనర్జీ అత్యధికంగా రూ.2 వేల కోట్ల పెట్టుబడితో పాటు 6,750 మంది ఉపాధి కల్పించబోతుంది. ఆ తర్వాత మరో బస్సుల తయారీ సంస్థ ఒలెకా్ట్ర.. రూ.300 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయబోతుంది. 3,500 మందికి ఉపాధి కల్పించనుంది. ప్యూర్ ఎనర్జీ రూ.500 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పించేలా యూనిట్‌ను నెలకొల్పనుంది. గాయం మోటా ర్స్ రూ.250 పెట్టుబడితో 1,400 మందికి, ఈటీవో మోటా ర్స్ రూ.1500 పెట్టుబడితో 1,500మందికి మూడు నుంచి ఐదేళ్లలో ఉపాధి అవకాశాలను కల్పించనుంది.