కరోనా వైరస్‌ ధాన్యం కొనుగోలుకు అడ్డుకాదు

ABN , First Publish Date - 2020-03-28T22:10:24+05:30 IST

రబీలో పండించిన పంటను సత్వరమే కొనుగోలుచేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు.

కరోనా వైరస్‌ ధాన్యం కొనుగోలుకు అడ్డుకాదు

హైదరాబాద్‌: రబీలో పండించిన పంటను సత్వరమే కొనుగోలుచేసేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్‌ ధాన్యం కొనుగోలుకు అడ్డుకాకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే అదే సమయంలో సంయమనం పాటించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి రైతాంగానికి విజ్ఞప్తిచేశారు. యాసంగిలో పండించిన పంట కొనుగోలు విషయంలో అనుసరించాల్సిన విధానం పై శనివారం నల్గొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్‌, జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్మన్‌ బండానరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య తదితరులు కూడా హాజరయి పలు అంశాలపై చర్చించారు. కరోనా మహమ్మారితో చేతికొచ్చిన పంట కొనుగోలు పై రైతుల్లో వెల్లువెత్తుతున్న పలు అనుమానాలను బ్రేక్‌చేస్తూ ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలోని 844 గ్రామ పంచాయితీలలో రెవెన్యూ గ్రామ పంచాయితీలలో రెవెన్యూ గ్రామాలను గుర్తించి 563లో 236 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనుకున్న ప్రభుత్వం ప్రభుత్వం కరోనా వైరస్‌ నేపధ్యంలో ఆ సంఖ్యను 340కి పెంచాలని నిర్ణయించినట్టు మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రకటించారు. 


కొత్తగా పెంచిన 104 కొనుగోలు కేంద్రాలతో పాటు రవాణా సౌకర్య ఉండి రైతులు సమిష్టిగా ఒక్కదగ్గరకు చేర గలిగితే కల్లాల వద్ద ప్రస్తుతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందని ఆయన చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ పద్దతిలో ఆదేశాలు ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా ముందెన్నడూ లేని రీతిలో పంట దిగుబడి పెరిగిందని అయితే కరోనా వైరస్‌ కొంత గందరగోళంలో పడేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రైతును ఆదుకోవాలన్న దృఢ సంకల్పంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిలల్లాలో వరి పంట వేసిన మొత్తం లక్షా 26వేల 450 హెక్టార్లలో 5 లక్షల 96వేల 960 మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందన్న అధికారుల అంచనాలను ఏకీభవిస్తూనే పంట దిగుబడిని బట్టి కొనుగోలు కేంద్రాలు ఉండేలా చూడాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. 

Updated Date - 2020-03-28T22:10:24+05:30 IST