తెలంగాణ ఉద్యమ స్పూర్తితో కరోనాపై యుద్ధం చేద్దాం

ABN , First Publish Date - 2020-03-21T23:34:51+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేద్దామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి నల్గొండ వాసులకు పిలుపునిచ్చారు.

తెలంగాణ ఉద్యమ స్పూర్తితో కరోనాపై యుద్ధం చేద్దాం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు ఆదివారం జనతా కర్ఫ్యూను విజయవంతం చేద్దామని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి నల్గొండ వాసులకు పిలుపునిచ్చారు. 24గంటలపాటు కర్ఫ్యూను పాటించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమంలో ఎలా పాల్గొన్నామో అదే స్పూర్తితో కరోనాను ఎదుర్కొందామని ఆయన పిలుపునిచ్చారు. కరోనాపై ఈ యుద్ధంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని అన్నారు. ఆదివారం ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉదయం 6గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారని అన్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్‌ను అడ్డుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. 24గంటలపాటు ఎవరూ బయటకు రావద్దని ఆహార పదార్ధాలు, మందులు, ఇతర అత్యవసర వస్తువులను ముందే కొనుగోలు చేసి పెట్టుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ రోడ్లమీదకు రాకుండా ఈ ఇరవై నాలుగు గంటలు ఉండి మరో మారు ఉద్యమ స్పూర్తిని ప్రపంచానికి చాటాలన్నారు. సరైన స్వీయ నియంత్రణ లేకనే కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభించి ప్రజల్ని పొట్టన పెట్టుకుంటోందన్నారు. ఈ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరి పై ఉందన్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే అలక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2020-03-21T23:34:51+05:30 IST