ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ కాలువ మరమ్మతులుచేపట్టండి

ABN , First Publish Date - 2020-03-03T02:38:09+05:30 IST

ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ కాలువ మరమ్మతులుచేపట్టండి

హైదరాబాద్‌: ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరితగతిన పూర్తిచేయడం ద్వారా వర్షాకాలంలో విడుదల చేయనున్న గోదావరి జలాలు చివరి వరకు వెడతాయని ఆయన అన్నారు డిస్ర్టిబ్యూటర్‌ కెనాల్‌ కింద ఉన్న కాలువల మరమ్మతులు ఇతరత్రా అంశాలపై సోమవారం ఆయన ఛాంబర్‌లో తుంగతుర్తి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌, నీటిపారుదల శాఖ ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ నాగేందర్‌రావు,ఎస్‌ఈ సుధీర్‌ తదితరులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి విడుదల చేసిన నీటితో ఈ యాసంగి పంటకు సూర్యపేట జిల్లాలో సమృద్ధిగా నీళ్లు అందించగలిగామని అందుకు సీఎం కేసీఆర్‌కు సూర్యపేట ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. అయితే అదే సమయంలో ఎప్పుడో తవ్వి వదిలేసిన ఎస్‌ఆర్‌ఎస్‌పి రెండో దశ కాలువల నిర్మాణం లోపభూయిష్టంగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. 


కాళేశ్వరం నుంచి గోదావరి జలాలు విడుదల చేసినప్పుడు ఈ విషయం బయట పడిందన్నారు. ఇది గమనించిన మీదటే వచ్చే వర్షాకాలం నాటికి పూర్తిస్థాయిలో నీరందించేందుకు కాలువల మరమ్మతులు ఇతర తవ్వకాలు చేపట్టేందుకు అవసరమైన అంచనాలు  సిద్ధం చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కాగా ప్రతి పక్షాలు ప్రజాదరణ కోల్పోయాయని మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజాదరణ కోల్పోఇయన వారి గురించి మాట్లాడ్డం అర్ధం లేదన్నారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువల మరమ్మతులు, నీటి పారుదలపై సమీక్షించిన మంత్రి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సూర్యాపేటకు కాళేశ్వరం నీళ్లురావంటూ విపక్షాలు చేసిన ఆరోపణలను విలేకరులు మంత్రి దృష్టికి  తీసుకు పోగా ఆయన పై విధంగా స్పందించారు. కాళేశ్వరం జలాలు సూర్యపేటకు వస్తే ఒకరేమో సన్యాసం తీసుకుంటానని, మరొకరు గులాబీ జెండాకు జై కొడతానని ప్రగల్బాలు పలికారు. ఇప్పుడు వారు ప్రజలకు ముఖం చాటేశారని ఎద్దేవా చేశారు. 

Updated Date - 2020-03-03T02:38:09+05:30 IST