కరోనా ప్రభావం వల్లే నిరాడంబరంగా పండగలు- ఇంద్రకరణ్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-08-20T20:18:56+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తిని సమర్దవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యమయిన నేపద్యంలో ప్రజలు ఒక చోట గుమిగూడె అవకాశం ఉన్న కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా నియంత్రణ కొనసాగుతున్నది.

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తిని సమర్దవంతంగా అరికట్టడానికి భౌతిక దూరం పాటించడం అనివార్యమయిన నేపద్యంలో ప్రజలు ఒక చోట గుమిగూడె అవకాశం ఉన్న కార్యక్రమాలపై దేశ వ్యాప్తంగా నియంత్రణ కొనసాగుతున్నది. కేంద్ర ప్రభుత్వ కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో కూడా జనం ఎక్కువగా పోగయ్యే అవకాశం ఉన్న సినిమాహాళ్లు, ఫంక్షన్‌హాల్స్, బార్లు, పబ్బులు, క్లబ్బుల వంటి వాటిని మూసేయడం జరిగిందని అటవీ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కరోనా కారణంగా కళాశాలలు, పాఠశాలలు, క్రీడా మైదానాలు, పార్కులను కూడా తెరవడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యం , ప్రాణాలను కాపాడడమే అతి ముఖ్యం కాబట్టి సామూహికంగా నిర్వహించే కార్యక్రమాలన్నింటిపైనా నియంత్రణ కొనసాగుతుందన్నారు.
కరోనా వైరస్ పై పోరాటం భాగంగా సామూహితక ఉత్సవాలకు అనుమతి ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. అందులో భాగంగానే తమ మార్చి 16వ తేదీ నుంచి అన్ని మతాల పండుగలు, ఉత్సవాలను దేవాలయాల్లో కాకుండా ఎవరిళ్లలో వారు నిర్వహించుకుంటున్నారని అన్నారు. ఉగాది, శ్రీరామనవమి, గుడ్ ఫ్రైడే, రంజాన్, జగ్నేకీరాత్, బోనాలు, బక్రీద్ తదితర పండగలు సామూహికంగా కాకుండా ఎవరి ఇళ్లలో వారు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారని తెలిపారు.
తాజాగా వినాయక చవితి ఉత్సవాలను , మొహర్రం కూడా కోవిడ్ నిబంధనలకనుగుణంగా జరుపుకోవాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తిచేశారు. అన్నిమతాల పండగలను, ఉత్సవాలను ఏ విధంగానైతే ఎవరిళ్లలో వారు జరుపుకుని కరోనా వ్యాప్తి నిరోధానికి సమకరించారో వినాయక చవితి, మొహర్రం విషయంలో కూడా అదే స్పూర్తి కొనసాగించాలని ఆయన కోరారు.