బహిరంగ ప్రదేశాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించొద్దు

ABN , First Publish Date - 2020-03-21T21:39:03+05:30 IST

ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తుందని, అయితే ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

బహిరంగ ప్రదేశాల్లో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించొద్దు

హైదరాబాద్‌: ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తుందని, అయితే ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. భద్రాద్రిలో జరిగే శ్రీరామ నవమి వేడుకలకు కూడా భక్తులకు అనుమతి లేదన్నారు. ఉగాది పంచాంగ శ్రవణం, శ్రీరామ నవమి వేడుకలు ఆలయాల్లో దర్శనాల రద్దుపై మంత్రి శనివారం సమీక్ష నిర్వమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్‌ విస్తరిస్తున్న నేపద్యంలో ముందు జాగ్రత్త చర్యగా సీఎం  కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రముఖ పుణ్య క్షేత్రాలు, ఆలయాల్లో దర్శనాలను రద్దు చేశామన్నారు. 


కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉగాది వేడుకలతో పాటు సామూహిక శ్రీరామనవమి వేడుకలను నిర్వహించ వద్దని సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపద్యంలో ఎటువంటి ఆడంబరాలకు తావులేకుండా పంచాంగ శ్రవణం, శ్రీరామ నవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈనెల 25న ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10గంటలకు పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇళ్లల్లోనే ఉండి లైవ్‌ ద్వారా టీవీల్లో ఉగాది పంచాంగ శ్రవణాన్ని వీక్షించాలని కోరారు. భద్రాద్రిలో యధావిధిగా శ్రీరామ నవమి వేడుకలు నిర్వమిస్తామని, కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే శ్రీరామనవమి వేడుకలు జరుగుతాయన్నారు. బహిరంగ వేడుకలు నిర్వహించ వద్దని ప్రజలకు విజ్ఞప్తిచేవారు.


ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పిస్తామని మంత్రి చెప్పారు. ఈసారి కళ్యాణ ఆహ్వాన పత్రికలు కూడా ముద్రించలేదన్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా భక్తులు పరిస్థితిని అర్ధం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తిచేశారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న వారికి డోర్‌ డెలివరీ ద్వారా శ్రీసీతారాముల స్వామివారి తలంబ్రాలు పంపిస్తామన్నారు. మరో వైపు వ్యాప్తి నివారణకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో సుదర్శన మృత్యుంజయ హోమాలను నిర్వహించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-21T21:39:03+05:30 IST