పరిసరాల పరిశుభ్రతపై ప్రజా ప్రతినిధులు ప్రచారం చేయాలి- ఆల్లోల

ABN , First Publish Date - 2020-05-10T20:45:20+05:30 IST

రాష్ట్రంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్ర

పరిసరాల పరిశుభ్రతపై ప్రజా ప్రతినిధులు ప్రచారం చేయాలి- ఆల్లోల

నిర్మల్‌: రాష్ట్రంలో ప్రజలంతా క్షేమంగా ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాలు అని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు తన నివాసంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అలాగే మంత్రి క్యాంపు కార్యాలయంలో ఉన్న బావిలో బ్లీచింగ్‌పౌడర్‌ వేశారు. పాత టైర్లలో, పూలకుండీల్లో నిల్వఉన్న నీటిని తొలగించారు. ఖాళీస్థలంలో నిల్వ ఉన్ననీరు, మట్టిని పాతపైపులను తొలగించారు. ఈసందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులు, విషజ్వరాలు, చికెన్‌గున్యా వంటి వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు చెప్పారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థాయి నుంచి అవగాహన కల్పించాలన్నారు.


ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోలోని కూలర్లు, పనికిరానీ టైర్లు, పూల కుండీలలో, పాత్రల్లో నిల్వ ఉన్న నీటిని ప్రతి ఆదివారం 10గంటలకు 10 నిమిషాలు వెచ్చిస్తే బాగుంటుందన్నారు. ఇలా పది వారాలపాటు పని చేయాలన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్‌ ఛైర్మన్లు పరిసరాల పరిశుభ్రత పై కృషి చేయాలన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ఈ కార్యక్రమాల పై అవగాహన కల్పించాలన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాలు తీసుకుని వ్యాదులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలంతా క్షేమంగా ఉండాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. కరోనా వ్యాధి ఇప్పుడిప్పుడే వదిలిపోయే అవకాశం లేదని, ఆ మహమ్మారితో సహజీవనం చేయవలసిన పరిస్ధితి నెలకొందన్నారు. అందుకనుగుణంగా ప్రజలంతా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ఛైర్మన్‌ గండ్రత్‌ఈశ్వర్‌, జిల్లా గ్రంధాలయసంస్థ ఛైర్మన్‌ ఎరవోతూ రాజేందర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-10T20:45:20+05:30 IST